Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Minister Gangula Kamalakar: గంగులకు ఎంఐఎం చెక్‌ పెడుతుందా..? ఈ సారి ఆయన గెలుపు కత్తిమీద సామే..!?

Minister Gangula Kamalakar: రాజకీయాలు ఎప్పుడెలా మారతాయో చెప్పడం కష్టం. మార్పులు ఒకోసారి స్థానిక నేతలకు చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఓ నేత అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంతపార్టీ నేతలతోపాటు మిత్రపక్షం కూడా షాక్‌లు ఇస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు కష్టమే అన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే..
కరీంనగర్‌.. పోరాటాల గడ్డ. ఇక్కడ రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ. కరీంనగర్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు గంగుల కమలాకర్‌. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగులకు వచ్చే ఎన్నికల్లో చెక్‌ పెట్టాలని సొంత పార్టీ నేతలే ప్లాన్‌ చేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్నవారి నుంచే సమస్యలు మొదలయ్యాయి. ఆయన కోటరీయే వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

మైనార్టీల ప్రభావం..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో మైనారిటీలు ఉన్నారు. గత రెండుసార్లు మైనారిటీల మద్దతుతోనే గంగుల కమలాకర్‌ గులాబీ పార్టీ తరపున విజయం సాధించారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదంటున్నారు స్థానిక మజ్లిస్‌ పార్టీ నాయకులు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్‌ తీరుపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత కొంత కాలంగా సామాన్యులనే కాదు.. మిత్రపక్షంగా ఉన్న తమను పట్టించుకోవడంలేదని మజ్లిస్‌ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

సోషల్‌ మీడియాలో వార్‌
ఈ మధ్యకాలంలో బీఆర్‌ఎస్‌ మైనార్టీ లీడర్స్, ఎంఐఎం నేతలకు మధ్య సోషల్‌ మీడియా వార్‌ పెద్ద ఎత్తున నడిచింది. ఇదంతా మంత్రి గంగుల కమలాకర్‌ కావాలనే చేయిస్తున్నారనే అనుమానాలూ ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సమావేశం నిర్వహించుకున్న ఎంఐఎం నేతలు.. వెయ్యి కోట్ల రూపాయల విరాళాలు సేకరించైనా కరీంనగర్‌లో గాలిపటం జెండా ఎగరేస్తామని చాలెంజ్‌ చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు పైసలు చల్లితే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారని.. అంతకుమించిన సినిమా తాము చూపిస్తామనీ సవాల్‌ విసిరారు. ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్‌ కమిటీ సభ్యుడైన సయ్యద్‌ గులాం హుస్సేన్‌నోటే ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటంతో.. కరీంనగర్‌లో పొలిటికల్‌ డైమెన్షన్స్‌ మారిపోతున్నాయన్న టాక్‌ నడుస్తోంది.

వినోద్‌కు మద్దతు..?
కరీంనగర్‌ కేంద్రంగా జరిగిన ఈద్‌ మిలాప్‌ పార్టీలో మాట్లాడిన నేతలు.. గులాబీ బాస్‌పైనా, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పైనా తమకున్న సాఫ్ట్‌ కార్నర్‌ ను బయటపెట్టారు. మంత్రి గంగులకు అనుకూలంగా ఒక్క మాటా మాట్లాడలేదు. వినోద్‌ చొరవ వల్లే స్మార్ట్‌ సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయంటూనే.. ఎమ్మెల్యే నిధులతో తమ డివిజన్లను అభివృద్ధి చేయాల్సిందేనన్న డిమాండ్‌ వారి మాటల్లో వినిపించింది. అంతేకాదు, ఎంఐఎం అండదండలతో గెల్చి ఎమ్మెల్యేలు, మంత్రులై ఇవాళ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పుతామని వార్నింగ్‌ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం అండ లేకుండా గెలిచి చూపించాలనీ గంగులకు ఎంఐఎం నేతలు సవాల్‌ కూడా విసిరారు.

అభ్యర్థిని బట్టే ఎంఐఎం నిర్ణయం
కరీంనగర్‌లో ప్రస్తుత రాజకీయ వాతావరణం గమనిస్తుంటే….వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కరీంనగర్‌ నుంచి పోటీకి సిద్ధమవుతోందనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉంటే..గంగులను ఎంపీ స్థానానికి పంపించి.. మాజీ ఎంపీ వినోద్‌ను కరీంనగర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశాలూ ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది. అయితే వినోద్‌ మాత్రం ఎంపీ స్థానానికే మొగ్గు చూపుతుండగా.. హుస్నాబాద్‌ నుంచి వినోద్‌ను గెలిపించాలన్న కేటీఆర్‌ ప్రకటనతో ఇక కరీంనగర్‌ అసెంబ్లీ టిక్కెట్‌ రేసులో వినోద్‌ ఉంటాడా అన్నది డౌటే..? వినోద్‌ పోటీలో ఉంటే ఎంఐఎం నేతల ఆలోచనలో ఏదైనా మార్పు రావచ్చునేమో గానీ..గంగుల కనుక మళ్లీ పోటీ చేస్తే మాత్రం మజ్లిస్‌ బరిలో దిగడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Share the post

Minister Gangula Kamalakar: గంగులకు ఎంఐఎం చెక్‌ పెడుతుందా..? ఈ సారి ఆయన గెలుపు కత్తిమీద సామే..!?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×