Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘హస్తినమే సవాల్’

Chandrababu to start with his Deeksha for AP Special Status in Delhi

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని మరింత ఇరుకున పెట్టేందుకు హస్తిన వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు విభజన హామీలు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రంగం సిద్ధమైంది.  ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో చేసిన ఘాట్ విమర్శల నేపథ్యంలో చంద్రబాబు దీక్షకు ఢిల్లీలో మరింత ప్రాధాన్యత పెరిగింది. 12 గంటల పాటు జరగనున్న దీక్ష కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు హస్తినకు చేరుకున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసన గళం వినిపిస్తున్నారు ఆయనను కవ్వించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఘాటుగా విమర్శలు చేయడం మొదలు పెట్టడంతో చంద్రబాబు నాయుడు తన స్వరాన్ని పెంచారు.  ఇన్నిరోజులు  రాష్ట్రస్థాయిలో చేసిన ధర్మపోరాట దీక్ష ఇప్పుడు ఢిల్లీకి చేరింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా  చంద్రబాబు నేతృత్వంలో స్వరం పెంచుతూ గళం కలుపుతూ ధర్మపోరాట దీక్షకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమై రాత్రి  8గంటల వరకు జరిగే ఈ దీక్ష కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, పాత్రికేయ సంఘాల నేతలు ఈ దీక్షలో భాగం కానున్నారు.

12 గంటల పాటు సాగే ఈ దీక్ష ప్రారంభించే ముందు ఉదయం 7గంటలకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి సీఎం చంద్రబాబు రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.  ఆ తర్వాత  ఆంధ్రప్రదేశ్ భవన్లో ఏర్పాటు చేసిన దీక్షా స్థలికి చేరుకుని సరిగ్గా ఉదయం 8 గంటలకు ధర్మ పోరాట దీక్షను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష కోసం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో భారీ వేదికను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వేదికపై ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, సీనియర్ నేతలు కూర్చునేలా ఏర్పాటు చేయగా, వేదిక ముందు ఏర్పాటు చేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్ల కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, వివిధ సంఘాల నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలుపుతూ విపక్ష కూటమి నేతలు వస్తున్న సందర్భంగా అందుకు అనుగుణంగా వేదికను సిద్ధం చేశారు. ఏపీ భవన్ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల జస్వంత్ సింగ్ రోడ్, అశోక రోడ్, మాన్ సింగ్ రోడ్, ఆర్పీ రోడ్ సహా సెంట్రల్ ఢిల్లీలోని పలు చోట్ల అడుగడుగునా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా విస్మరించిందో వివరిస్తూ ఈ ఫ్లెక్సీలను రూపొందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సవాలు విసిరేలా భారీ నిరసన ప్రదర్శనకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగనున్న దీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, శ్రీకాకుళం నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో  పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి చేరుకున్నారు.

ఈరోజు జరిగే ధర్మ పోరాట దీక్ష తర్వాత రేపు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక బృందంగా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. బుధవారం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో మరో నిరసన దీక్షలో పాల్గొననున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తలపెట్టిన “తానాషాహీ హఠావో – దేశ్ బచావో” ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. జంతర్‌మంతర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మరికొందరు విపక్ష కూటమి నేతలు హాజరుకానున్నారని సమాచారం. దీంతో ఆదివారం రాత్రి నుంచి బుధవారం వరకు ఏపీ సీఎం దేశ రాజధానిలోనే ఉండి వివిధ రూపాల్లో నిరసన గళం వినిపించనున్నారు.

-కెవిఎల్ఎన్ నరసింహారావు

The post ‘హస్తినమే సవాల్’ appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

‘హస్తినమే సవాల్’

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×