Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బహుజన నాయకులకు పదవులా.. బహుజన ఎజెండానా.. ఏది మనకు ముఖ్యం?


తెలుగునాట బహుజన ఉద్యమాల మార్గదర్శి ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు *జూలై 26న సాక్షి పత్రిక* లో రాసిన  _*"ఎర్ర జెండాకు దళిత స్పృహ"*_ వ్యాసంలో లేవనెత్తిన కొన్ని అంశాల పట్ల.. బహుజన ఉద్యమ కార్యకర్తగా నాకున్న కొన్ని అభ్యంతరాలను తెలియచెప్పడానికే ఈ పోస్ట్ రాస్తున్నాను.

సదరు వ్యాసంలో.. ఆయా రాజకీయ పార్టీల వారు దళిత నాయకులకు ఉన్నత స్థానాలు కట్టబెట్టడం ద్వారా బహుజన వర్గాలకు మేలు చేసిన వారయ్యారని వివరించిన ఐలయ్య గారు.. బిజెపి పార్టీ దళితులకు చేసిన "మేలు" గురించి ఇలా వివరించారు: "దళిత నేత రామ్‌నాథ్‌ కోవింద్‌ ను బిజేపి పార్టీ రాష్ట్రపతిని చేసింది.  రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి పదవిపై, దేశ చిత్రపటంపై ఎలాంటి ముద్ర వేయనున్నారో.. మనం వేచి చూడాలి."  అదే వ్యాసంలో.. బీజేపీ మాతృసంస్ధ ఆరెసెస్ గురించి రాస్తూ.. "ఆరెస్సెస్‌  తన అత్యున్నత స్థానంలోకి ఒక దళితుడిని, ఆదివాసీని ప్రోత్సహించలేదు. (బంగారు లక్ష్మణ్‌ మినహాయింపు)." అని వ్యాఖ్యానించారు ఐలయ్య సార్.

*"దళిత స్పృహ" అనే అంశం మీద వ్యాసం రాస్తున్న కంచ ఐలయ్య గారు.. ఆర్ఎస్ఎస్- బీజేపీ లు దళిత నాయకులకు పదవులు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబేమిటో.. దళిత స్పృహ తో ఆలోచిస్తే బాగుండేదని నా అభిప్రాయం.*

"ఆర్ఎస్ఎస్ - బిజెపి అండతో  దేశ రాష్ట్రపతి గా ఎదిగిన రామనాథ్ కోవింద్ బహుజన వర్గాలకు ఏ రీతిన మేలు చేయనున్నాడో మనం వేచి చూడాలి..!" అనే మాట బహుజన తత్వవేత్త నోటి నుండి రావడం బాధాకరం.  ఎందుకా మాట అంటున్నానంటే.. ఈరోజు దేశంలో బహుజన వాదంతో పనిచేస్తున్న ఏ కార్యకర్తకైనా.. మనువాద సంస్థలైన ఆర్ఎస్ఎస్-బిజెపిలు దళిత నాయకులకు ఎందుకు పదవులు కట్టబెడుతున్నారో.. తాము చేపట్టే దళిత వ్యతిరేక మనువాద చర్యలకు ముసుగు కప్పడానికి తమ దయతో పదవులు చేపట్టిన దళిత నాయకులను ఎలా వాడుకుంటున్నారో.. చాలా సులభంగా అర్థమవుతుంది. మను వాద సంస్థల  "మోడస్ ఆపరాండి" ని కనీస మాత్రంగా పరిశీలించిన ఏ బహుజన ఉద్యమ కార్యకర్తకైనా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. దురదృష్టవశాత్తూ.. బహుజన తత్వవేత్తలైన పెద్దలే.. మనువాదుల దయతో పదవులు సంపాదించుకున్న బహుజన నాయకులు బహుజన వర్గాలకు ఏదో మేలు చేస్తారంటూ  తాము నమ్మడం.. తమ అనుయాయులను నమ్మించ బూనడం బాధాకరమైన అంశం!

ఫూలే అంబేద్కర్ లు మనకందించిన విజ్ఞానాన్ని సక్రమంగా మనం వినియోగించుకునే క్రమంలో.. బహుజన శ్రేణులకు ఉండాల్సిన ఒక కనీస అవగాహన ఏమిటంటే.. మిగతా అంశాలను గుర్తించినా గుర్తించకపోయినా.. *మనువాద సంస్థల కుట్రలను, కుతంత్రాలను సరిగ్గా అర్ధం చేసుకోగలగాలి!*  ఆ కుట్రల గురించి.. వాళ్ల చర్యల వెనుక ఉన్న అసలు మతలబు గురించి.. బహుజన శ్రేణులను అలర్ట్ చేయగలగాలి. ఆర్ఎస్ఎస్ 1925 నుండి నేటి వరకూ నిఖార్సైన మనువాద  ఎజెండానే కొనసాగిస్తున్నదని స్పష్టంగా తెలిసి కూడా..  కొందరు దళిత నాయకులకు వారు పదవులు ఇవ్వడం వెనకనున్న మతలబేందో మనం గుర్తించకపోతే.. బాబాసాహెబ్ మనకందించిన విజ్ఞానం విఫలమైనట్టే!

*బంగారు లక్ష్మణ్ కి పదవినివ్వడం అనేది ఆరెస్సెస్ చేసిన మంచి పనేనంటూ ఐలయ్య గారు  కితాబునివ్వడం అంటే.. "ఆర్ఎస్ఎస్ మనువాద ఎజెండా గురించి మీరు పట్టించుకోకండి.. ఆర్ఎస్ఎస్ దళిత నాయకులకు పదవులు ఇచ్చే మంచి గుణం కలదే, గమనించండి!" అంటూ.. దళిత శ్రేణులకు ఆర్ఎస్ఎస్ ను సిఫారసు చేయడమే కదా? బంగారు లక్ష్మణ్ కి పదవి ఇవ్వడం ఆర్ఎస్ఎస్ చేసిన మంచి పనే. సందేహం లేదు. అయితే.. ఆ "మంచి" ఎవరికి? దళితులకు కాదు.. మనువాదులకే!* ఒక దళిత బిడ్డ మనువాదులకు గుడ్  కండక్ట్ సర్టిఫికెట్ ఇస్తే ఆ కండక్ట్ సర్టిఫికెట్ ను చూపెడుతూ మనువాదులు తమ ఎజెండాను నిరాటంకంగా కొనసాగించగలగడమే.. అందులో ఒనగూరే మంచి!

స్పష్టమైన ఎజెండాతో ముందుకు పోతున్న ఒక మనువాద సంస్థలో మన బహుజన వర్గాలకు చెందిన ఒక నాయకుడు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా.. ఆ మనువాద ఎజెండానే అమలు చేయాల్సి ఉంటుందన్నది సుస్పష్టం.  సదరు బహుజన నాయకుడు "మనోడు" కాబట్టి .. ఆ చట్రంలో ఇరుక్కోడని.. సదరు ఉన్నత స్ధానాన్ని తన బహుజన వర్గాలకు మేలు చేయడానికి  ఉపయోగిస్తాడని.. ఆశించే ధోరణి.. సామాన్య బహుజనుల్లో కనబడితే దాన్ని "అమాయకత్వం" అంటాము. ఆ ధోరణి బహుజన తత్వవేత్తలే ప్రదర్శిస్తే.. దాన్ని ఏమనాలి?  *బహుజన నాయకులకు మనువాద సంఘాలు పదవులను అప్పగించిన వైనం గురించి మాట్లాడుతున్నప్పుడు..  ఆ చర్యల వెనుక నున్న మనువాదుల కుట్ర గురించి.. సూటిగా స్పష్టంగా.. బహుజన శ్రేణులకు అసలు రహస్యం వివరించి చెప్పలేకపోతే.. సదరు బహుజన తత్వవేత్తలకు బహుజన స్పృహ ఉన్నట్టా.. లేనట్టా..?*  తమ తప్పుడు అవగాహనల వలన బహుజన శ్రేణులకు ఎంత నష్టం కలిగిస్తున్నామో.. వారు జర గుర్తించాలని మనవి!

మన బహుజన శ్రేణులలోగల మరొక తప్పుడు అవగాహనను కూడా మనం గుర్తించాల్సిన అవసరమున్నది.
"మన బహుజనులకు మనువాదులు పదవులు ఇవ్వడం కుతంత్రంలో  భాగమేనన్నది నిజమే కానీ.. మన బహుజనులు ఆ కుట్రకు లొంగిపోరు.  మన కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు మనకు  ద్రోహం చేస్తారా? ఒక బహుజనుడు ఖచ్చితంగా.. బహుజనుల ప్రయోజనాల కోసమే నిలుస్తాడు" అంటూ అమాయకంగా మనోళ్ళు నమ్ముతున్నారు. అలాంటి విషయాలను నమ్మే బహుజన సోదరులకు నాదొక మనవి.  దోపిడీదారులయిన మనువాదులు.. తమ దోపిడీ నిరాటంకంగా కొనసాగించడం కోసం.. "నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ"ను ఎట్లా ఏర్పాటు చేశారో.. వాళ్లు చేసిన కుట్రలో మనోళ్లు ఎట్లా చిక్కుకుపోయారో.. తెలియజెప్పే రీతిలో బాబాసాహెబ్ ఎంతో శ్రమకోర్చి కనిపెట్టిన సత్యాలని మరోసారి పరిశీలించాలని నేను కోరుతున్నాను.

కుల వ్యవస్థను నిశితంగా పరిశీలించిన సామాజికవేత్తలు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారందరిలోకెల్లా.. లోతైన విశ్లేషణ చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ అగ్రగణ్యుడుగా నిలిచాడు. *ఒక సోషల్ సైంటిస్ట్ గా అంబేడ్కర్  మనకందించిన విలువైన సూత్రం.. "నిచ్చన మెట్ల కులవ్యవస్థ" స్వరూపాన్ని కనుక్కోవడం.* ముందు వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి.. తమ దోపిడీ క్రమాన్ని మొదలు పెట్టిన మనువాదులు.. కొన్ని వందల సంవత్సరాల తర్వాత తమ దోపిడీ లో రెండవ స్టెప్ గా "నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ" ను సృష్టించారని అంబేద్కర్ తన పరిశోధనలో కనుగొన్నాడు.  ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో భాగంగా .. అప్పటి వరకు ఒకే వర్ణంగా ఉన్న శూద్రులలో హెచ్చు తగ్గు బేధాలు కలిగిన మూడు వేల కులాలను సృష్టించి.. ఆయా కులాల చట్రాలలో వారిని బంధించి.. వారి మధ్య ఐక్యతకు తావులేని కుటిల పన్నాగం మనువాదులు రచించారు. పై మెట్టుపై ఒక కులం.. దాని కింద ఇంకో కులం.. దాని కింద ఇంకోటి.. ఉండేవిధంగా కుటిల పథకాన్ని అమలు చేశారు. ఆ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను శాశ్వతం చేయడానికి రకరకాల పుక్కిటి పురాణాలు.. దేవుడు - కర్మ, స్వర్గం - నరకం.. భయాలు సృష్టించి, ఆ భావజాలాన్ని పీడితుల బుర్రలనిండా నింపి.. వారిని శాశ్వత బానిసలుగా చేయగలిగారు. ఇక ఈ బానిసలను కట్టి పడవేయడానికి సంకెళ్లు అవసరం లేదు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో.. ''పైనున్నోనికి మొక్కుతా.. కిందున్నోన్ని తొక్కుతా..'' అనే సూత్రం ఒక రన్నింగ్‌ మెకానిజంగా పనిచేసింది. కులవ్యవస్థ బాధితులందరూ తమలో తాము కోట్లాడుకుంటూ.. ఒకరి ప్రయోజనాలని మరొకరు దెబ్బతీస్తూ..  అసలు దోపిడీదారులైన మనువాదులను నెత్తిన పెట్టుకుని పూజించడమే తమ అస్తిత్వంగా స్వీకరించారు. *"ఎవరి కులం ప్రయోజనాల్ని  వాళ్లు చూసుకోవాలి.. ఒకే కులంలో సైతం ఎవడి ప్రయోజనాలను వాడు చూసుకోవాలి. ఫలితంగా మనువాదుల దోపిడీ నిరాటంకంగా కొనసాగాలి" అనేదే.. ఈ "నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ" ఏర్పాటు వెనకనున్న మనువాదుల అసలు కుతంత్రం.* ఈ సత్యాన్ని అంబేద్కర్ మొట్టమొదటగా వెలికి తీశాడు.

బహుజన కుటుంబంలో పుట్టిన వాడు.. బై డిఫాల్ట్.. బహుజన వర్గాల మేలు కోసం పని చేస్తాడని అనుకోవడం అవగాహనారాహిత్యమే.  నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో భాగస్వాములమైన కారణంగా.. సహజంగా మనందరమూ మన బుర్రలో నింపబడిన మనువాద భావజాలానికి అనుగుణంగానే పని చేస్తాము. మనువాద వ్యవస్థ అసలు స్వరూపాన్ని గుర్తించి, బహుజన చైతన్యాన్ని స్వీకరించనంత వరకూ.. బహుజన కుటుంబాలలో పుట్టిన వారమైనా..  మనందరమూ ఉన్నస్థితినే కొనసాగించాలని చూస్తాము. యధాతథ స్థితిని (స్టేటస్ కో) ని కొనసాగించడం అంటే.. మనువాద వ్యవస్థను కొనసాగించడమే! అంతిమంగా మను వాదానికి వత్తాసు పలకడమే.. దానికి మద్దతుగా నిలవడమే!! అదే పని చేస్తాం మనం.. బహుజన చైతన్యం అందనంత వరకూ! ఇంకోమాటలో చెప్పాలంటే.. బహుజన ఎజెండా లేని బహుజన సోదరులు బహుజన శ్రేణుల ప్రయోజనాల కోసం నిలబడరు. గాలివాటంతో కొట్టుకుపోతూ.. అంతిమంగా.. ఆధిపత్య స్థానంలో ఉన్న మనువాదుల చేతుల్లో పనిముట్లుగా పని చేస్తారు. *బహుజన వర్గాలకు మేలు జరగాలంటే.. కావలసింది బహుజన దృక్పథం కలవారు.. బహుజన ఎజెండాను అమలు పరిచే వారు.. మరీ ముఖ్యంగా మనువాద దోపిడీ గురించి స్పష్టమైన అవగాహన కలిగిన వారు!*

ఈ సత్యాల వెలుగులో ఆలోచిస్తే.. ఆయా పార్టీల వాళ్లు దళిత నాయకులకు పదవులను కట్ట బెట్టినంత మాత్రాన సామాజిక న్యాయానికి ఒరిగే మేలు ఏమీ లేదని,  బహుజన వర్గాలకు దక్కే ప్రయోజనం ఏదీ లేదని మనం గుర్తించగలుగుతాము. *విధానాలు ముఖ్యం తప్ప.. వ్యక్తులు ముఖ్యం కాదనే కీలకమైన అంశాన్ని  మనం గుర్తించగలగాలి.*

*ఈ ప్రబల సత్యాన్ని నిరూపించే వాస్తవం.. మనకు బాబాసాహెబ్ జీవితంలోనే కనబడుతుంది.*  స్వాతంత్రానికి ముందు రోజుల్లో.. నిమ్న వర్గాల హక్కుల కోసం బాబా సాహెబ్  ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు.. మనువాదుల ప్రతినిధి ఐన గాంధీకి బంటుగా నిలబడి.. అడుగడుగునా అంబేడ్కర్ని అడ్డుకున్నది ఎవరు?  ఆయన మరెవరో కాదు.. బాబూ జగ్జీవన్ రామ్! బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పుడు.. భారత దేశపు నిమ్న వర్గాలకు ప్రతినిధిగా నేను మాట్లాడుతానంటూ అంబేడ్కర్ ముందుకు వచ్చినప్పుడు..  హిందువులకే కాదు, నిమ్నవర్గాలకు సైతం గాంధీయే ప్రతినిధి అంటూ అడ్డుకున్నాడు జగ్జీవన్ రామ్. అంబేద్కర్ బతికి ఉన్నంతకాలం.. అంబేద్కర్ కి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ జగ్జీవన్ రామ్ ని వాడుకున్నదని జగ్జీవన్ రామ్ సతీమణి *ఇంద్రాదేవి జగ్జీవన్ రామ్* "మైల్ స్టోన్స్: ఎ మెమాయిర్ " అనే పుస్తకంలో స్వయంగా రాసారు. తన చివరి రోజుల్లో ఈ అంశంపై జగ్జీవన్ రామ్ పశ్చాత్తాపం వెలి బుచ్చేవాడట.

అంబేద్కర్, జగ్జీవవన్ రామ్.. ఇద్దరూ దళిత వర్గాల నుండి వచ్చిన వారే. ఒకరు దళిత వర్గాలకు మేలు చేయాలని చూస్తే.. ఆ ప్రయత్నాలకు గండి కొట్టే రీతిలో మరొకరు మనువాదులకు మద్దతు ఎందుకు ఇచ్చారు?  *తేడా ఏమిటి?  తేడా పుట్టుకలో లేదు.  తేడా విధానంలో ఉన్నది.. తేడా ఎజెండా లో ఉన్నదనే సత్యం మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయమే కదా!*

నాటి కాలంలో జగ్జీవన్ రామ్ ఒక్కడే. 
మరి నేటి కాలంలో.. ఎంత మంది మన బహుజన బిడ్డలు మనువాదుల సేవలో తరిస్తున్నారు? రామ్ విలాస్ పాశ్వానులు, రామ్నాథ్ కోవిందులు, రాందాస్ అథవాలేలు, దత్తాత్రేయలు, సంజయులు, అరవిందులు, ఉదిత్ రాజులు, వివేకులు.. అనేకానేకులూ చేస్తున్నది అదే కదా..!?

ఈ సత్యాల వెలుగులో.. బహుజన ఉద్యమ కార్యకర్తలు మరియు బహుజన సిద్ధాంతకర్తలు సరైన వైఖరిని కలిగి ఉండాలని.. మనువాదుల కుట్రలని గుర్తించాలని.. ఫూలే, అంబేద్కర్ లు అందించిన విజ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేసే రీతిలో ఆలోచిస్తూ, బహుజన వర్గాలకు మేలు చేసే సరైన తోవ చూపాలని నేను కోరుతున్నాను! 🙏🙏

*జై ఫూలే!   జై భీమ్!!   జై భారత్!!!*
✊✊✊✊✊✊✊✊✊

*R. RAJESHAM*
*సామాజిక న్యాయ వేదిక*
9440443183


This post first appeared on Venugopal Bandlamudi, please read the originial post: here

Share the post

బహుజన నాయకులకు పదవులా.. బహుజన ఎజెండానా.. ఏది మనకు ముఖ్యం?

×

Subscribe to Venugopal Bandlamudi

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×