Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆ నలుగురు .. ఒక ‘శకం’ ముగిసింది! అటువంటి శకాన్ని చరిత్ర మళ్ళీ చూస్తుందా?

నందమూరి తారక రామారావు గారు (44 యేళ్ళ కెరీరు – 300 సినిమాలు)
అక్కినేని నాగేశ్వర్రావు గారు (72 యేళ్ళ కెరీరు; 255 సినిమాలు)
ఉప్పు శోభన్ బాబు గారు (37 యేళ్ళలో 230 సినిమాలు)
ఘట్టమనేని కృష్ణ గారు (50 యేళ్ళు; 350 సినిమాలు)

నలుగురు కలిసి 200 యేళ్ళకు పైగా యాక్టివ్ క్యుములేటివ్ కెరీరు, 1135 సినిమాలు.. అంటే యావరేజిన యేడాదికి ఆరు సినిమాలు.. అంటే రోజూ రెండు షిఫ్టులు పనిచేస్తే కానీ పూర్తికానంత పని..

వీళ్ళు ఎటెంప్ట్ చేయని జోనర్ లేదు.. సాంఘికం, పౌరాణికం, జానపదం, డ్రామా, కామెడీ, రొమాన్సు, ఫ్యామిలీ, యాక్షన్, హారరు.. అన్నీ చేశారు.. తమ కెరీరు పీక్స్ లో ఉన్నప్పుడు కూడా ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు. ఒకపక్కన అభిమానులు పోస్టర్ల మీద భీకరమైన పేడ యుధ్ధాలు చేస్కుంటూ ఉన్న సమయంలో మల్టీస్టారర్స్ చేశారు.. ఏ గ్రాఫిక్స్ లేని ఆర్గానిక్ ఫైట్లూ, డాన్సులూ చేశారు..

లేబొరేటరీ దగ్గర రిలీజుకి ముందు రోజులతరబడి జరిగే ప్రింటింగు ప్రాసెస్సులు, వందల కొద్దీ ప్రింట్లు, వేల కొద్దీ రీలు బాక్సులు, బస్తాలతో కలెక్షన్ల క్యాషు తీసుకొచ్చి బ్యాంకుల్లో గుట్టగా పోసే డిస్ట్రిబ్యూటర్లు, రీలు బాక్సులు పట్టుకుని పరుగులు తీసే థియేటరు కుర్రాళ్ళు, టికెట్ కౌంటర్ల దగ్గర చొక్కాలు చిరిగిపోయి మో చేతులు డోక్కుపోయేంతగా ముష్టియుధ్ధాలు, హీరో ఎంట్రీలకు చిరిగిపోయే స్క్రీన్లు, ఈలల సౌండుకి పగిలిపోయే స్పీకర్లు, యాభై అడుగుల ఎత్తులో భారీ కటౌట్లు, పది రూపాయల టికెటు వందకి అమ్ముడు పోయేంత బ్లాక్ ఫివర్, శతదినోత్సవాలు, సిల్వర్ జూబిలీలు, యేడాదికి పైగా ఆడించిన ప్లాటినం జూబిలీలు, లక్షలకు పైగా అమ్ముడుపోయే ఆడియో క్యాసెట్లు, డైలాగు డ్రామాలు..

తమకున్న పరిధిలో విస్తృత ప్రతిభను కనబరుస్తూ నటనను మించి ప్రయోగాలు ప్రారంభించి విశేషమైన కీర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ధీరోదాత్తులు ‘ఆ నలుగురు’. అయితే మన కథానాయకులు తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుని, అనుకరణ జోలికి పోకుండా, తమకు సరిపడే పాత్రలని ఎన్నుకుని, తమకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలను అద్భుతంగా పోషించి తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలో తమకంటూ ఎప్పటికి చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు.

అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు భాషకున్న ప్రత్యేకమైన స్థానాన్ని పదిలంగా కాపాడారు.. జాతికి విపత్తు వొచ్చినప్పుడు అందరూ ఒక్కటై అందరినీ ఒక్క తాటి మీదికి తీసుకొచ్చి జోలెపట్టి విరాళాలు సేకరించారు.. ఉద్యమాలు చేశారు, రాజకీయాల్లో పాల్గొన్నారు, పదవులు చేపట్టారు, పద్మశ్రీలు సంపాదించుకున్నారు..

ఈ ‘తరం’ వెళ్ళిపోయింది.. మొన్న కృష్ణ గారు వెళ్ళిపోవడంతో ఒక శకం ముగిసిపోయింది.. ఈ రోజు తెలుగు సినీ అభిమాని ప్రతి ఒక్కరూ వీళ్ళందరికీ నివాళిగా ఒక్క కన్నీటిబొట్టు రాల్చాల్సిన సమయం.. అందరినీ గుర్తుతెచ్చుకుని గుండెల్లోని అభిమానాన్ని పెదాలమీదికి తెచ్చుకుని హాయిగా ఓ చిరునవ్వు నవ్వాల్సిన సమయం..



This post first appeared on Subhamastu:Kamma Matrimony Services, please read the originial post: here

Share the post

ఆ నలుగురు .. ఒక ‘శకం’ ముగిసింది! అటువంటి శకాన్ని చరిత్ర మళ్ళీ చూస్తుందా?

×

Subscribe to Subhamastu:kamma Matrimony Services

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×