Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

గుంటురుకారం దంచే రోకలి ఆవురావురనిపించే ఆకలి కావాలోయ్ నవావకాయకి(మొన్నటి పోస్టుకి సీక్వెల్, వెల్లుల్లి లేకుండా ☝🏽..)

Tags: agravedeg

మామిడిముక్క, మిరపమొక్క, ఆవగింజ, పప్పునూనె, ఉప్పురాయి కాదేదీ కవితకనర్హం

పాతబడిన ఆవకాయ అస్సలు బావుండదు, చల్లారిన ఆవేశం ఎందుకూ పనికిరాదు.
అందుకే మొన్నటి ఆవకాయ పోస్టు రగిలించిన ఆవేశాలు చల్లారిపోకుండా దానికి సీక్వెల్ ఇప్పుడే పెట్టేస్తున్నా. ఎందుకోగానీ ఈ యేడు ఆవకాయావేశానికి శ్రీశ్రీ భావావేశం తోడయ్యింది. మనకి ఆవకాయ ఎంతిష్టమైతే మాత్రం? ప్రపంచం బాధని తన బాధ చేసుకున్న మహాకవి భావాలకి కనీసం లిప్-సర్వీస్ చెయ్యకుండా ఆయన కవితలకి పేరడీలు రాయడం ఏఁవన్నా బావుంటుందా? చాలా బాగోదు. అందుకే చల్లారిపోయిన మనిషి ఆవేశాలపై కాస్త ఆక్రోశం, మధ్య మధ్య ఆవకాయ నంజుకుంటూ –

మనం, ఇండియన్లం – అందులోనూ ఆంధ్రేండియన్లం – ఆవకాయని తీసుకున్నంత సీరియస్‌గా కొన్ని ఆవేశాల్ని తీసుకోం.
ఆవకాయని ఉంచుకున్నంత ఫ్రెష్‌గా అవసరమైన ఆవేశాల్ని వుంచుకోం.
నంజుకోడానికి నవావకాయ

కాయని ముక్కలు చేసే కత్తీ
ఆరారగ గ్లాసెడు కాఫీ
మధ్యమధ్య మరదళ్ళతొ సరసం**
కావాలోయ్ నవావకాయకి

** శ్రీశ్రీగారిది భావావేశం, కొత్తల్లుళ్ళది బావావేశం

రైట్స్ కోసం మాట్లాడతాం,
రెస్పాన్సిబిలిటీస్ గురించి పోట్లాడలేం.
ఏదో ఒక పార్టీ వెనకో, లీడర్ పక్కనో కళ్ళు మూసుకుని పోలరైజ్ అవుతాం,
పార్టీల్తో పని లేకుండా సమస్యలపై యునైట్ అవడంలో నిద్రపోతాం.
వెధవ వెస్టర్న్ కల్చరని అరుస్తాం,
దానికి సందిచ్చిన సోషల్ లూప్‌హోల్స్ మనలో ఏఁవున్నాయని సిన్సియర్ డిబేట్ పెట్టం.
నాలుక మీదకి నవావకాయ

జీడిరసం తుడిచేందుకు బట్టా
గుంటురుకారం దంచే రోకలి
ఆవురావురనిపించే ఆకలి
కావాలోయ్ నవావకాయకి

రాజకీయాలు తగలడిపోయాయని తల్లడిల్లిపోతాం,
అవెందుకిలా తగలడ్డాయో చెప్పి, బాగుచేస్తానన్నవాడికి ఛస్తే వోట్లెయ్యం.
ఇంకాపైగా, కొందరు వోట్లకి డబ్బులిస్తే తీసుకుంటాం, ఛా, పొమ్మనం.
విభజించి పాలిస్తున్నారని ఓవరాక్షన్ చేస్తాం,
లైట్లార్పి, తలుపులేసి విభజిస్తుంటే ఏ యాక్షన్ తీసుకోం.
టీవీలూ, సినిమాలూ చెత్త చూపిస్తున్నాయని వాపోతాం,
చెత్త టీవీల్ని, సినిమాల్ని ఒక్కరోజైనా బాయ్-కాట్ చేసి ఆపెయ్యం. కొసరుగ కాస్త కొత్తావకాయ

పిండి కలిపే పేద్ద బేసిను
కలగలిపే గాజుల చేతులు
ఊరెయ్యగ పింగాణీ జాడీ
కావాలోయ్ నవావకాయకి

ఇదండీ ఈనాటి* ఆవకాయావేశం. నవావకాయకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన శ్రీశ్రీ నవకవితని కూడా పోస్ట్ చెయ్యాలనిపించి దాన్నొకసారి మళ్ళీ చదువుకున్నా. చదువుతుంటే ఎప్పుడో ఏళ్ళ కిందట విన్న ఘంటసాల నోట పలికిన దాశరధి పాట గుర్తొచ్చింది. ఆ పాత ఆవేశాలు** (= పాట రూపంలో వున్న ఆవకాయలు) రెండూ ఇక్కడ వుంచుతున్నా ఆవకాయ తిన్నప్పుడల్లా గుర్తు రావాలని. ఘంటసాల “ఆవేశం రావాలీ..” అనేప్పుడు ని ఒకరకంగా నొక్కి పలుకుతారు. ఆ నొక్కు నాకు చాలా ఇష్టం.
(*ఈనాడు మాట చూసి ప్రియా పచ్చళ్ళు గుర్తొస్తే అందుకు నా పూచీ ఏంలేదు, సరేనా? ** పాత ఆవేశం అంటుంటే ఇక్కడ “ఆవకాయలో వెల్లుల్లి” అనే బ్లాగ్లోకంలో వైరల్ అవుతున్న సబ్జెక్టు కొంచెం డిస్కస్ చెయ్యాలనిపించింది. వీఎన్నార్ సర్ గోంగూర మీద టపా రాయమన్నారు. ఆ టపాలో డిస్కస్ చేస్తా. )

ఝంఝానిల **

బై ద వే, కొత్తల్లుళ్ళు ముక్కలు కొడుతుంటే , అమ్మమ్మలు ఆవకాయ పిండి కలుపుతుంటే చూసిన దృశ్యకావ్యాలు మనసులో ఉండిపోయి ఈ “ఖండకావ్యం” తయారైంది, అంతేకాని ఒక్కసారైనా ఆవకాయ పెట్టిన పాపాన పోయికాదు. అంచేత టెక్నాలజీలో పొరపాట్లుంటే ఆవకాయలో కరగకుండా ఉండిపోయిన ఉప్పురాళ్ళనుకుని ఆస్వాదించెయ్యండి. బై4నౌ .
వీఎన్నార్ సార్ వ్యాఖ్యతో (నవావకాయకి inputs ఆయన ఇచ్చినవే) వచ్చిన ఐడియాలోంచి పుట్టిన ఈ ఆవకాయ సీక్వెల్ కబుర్లు ఈసారికి సమాప్తం. ThankYou, VNR Sir _/\_ , మీ కోరిక మీద వెల్లుల్లి తగలకుండా చేసిన ఈవకాయ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా.



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

గుంటురుకారం దంచే రోకలి ఆవురావురనిపించే ఆకలి కావాలోయ్ నవావకాయకి(మొన్నటి పోస్టుకి సీక్వెల్, వెల్లుల్లి లేకుండా ☝🏽..)

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×