Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Janatha Garage Special Story : మధుర లంబాడీలు.. చేజారిన రిజర్వేషన్ల కోసం పోరాటం..

Janatha Garage Special Story : ప్రకృతితో మమేకమైన జీవన విధానం వారిది. లబానా బంజారాలుగా.. లోహానా వేసుకొని పలు యుద్ధాల్లో పాలుపంచుకున్న ధీరత్వం వారిది. మధురలుగా పశుపోషణతో సంచారజాతులుగా వచ్చి.. తెలంగాణలో స్థిర జీవనం ఏర్పరచుకొని.. ఈ ప్రాంత బిడ్డలయ్యారు. భాష నుంచి ఆచార వ్యవహారాల దాకా.. ఆద్యంతం వైవిధ్య జీవన విధానం ఉన్న వాళ్లే.. కాయితీ లంబాడీలు. వారి జీవన చిత్రమే ఈ వారం జనతా గ్యారేజ్.

తెలంగాణలో వెనకబాటుతనంలో ఉండి.. అభివృద్ధి ఫలాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఓ జాతి కథ ఇది. వచ్చినట్టే వచ్చి చేతికందే దశలో దూరమైన రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలకుపైగా ఎదురుచూపులతో ఉన్నవారే మధురలు. అచ్చం లంబాడీల చరిత్రకు సమకాలీనమైన చరిత్రే ఉన్నా.. వీరి సంసృతీ సంప్రదాయాలు లంబాడీలతో పోలిస్తే కాస్త విభిన్నంగా ఉంటాయి. తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ మధురలు ఎవరో? వారి చరిత్ర ఏంటో జనతా గ్యారేజ్ స్పెషల్ లో తెలుసుకుందాం..

ప్రకృతితో మమేకమైన జీవితం మధురలది . ఈ మధులరనే కాయితీ లంబాడీలు, ఛుండువాళ్లు, జుట్టు లంబాడీలు అని కూడా పిలుస్తుంటారు. కాయితీ లంబాడీలు కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రమే పరిమితం. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాంతంలో వీరి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గాంధారితోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో కొన్ని తండాల్లో సైతం కనిపిస్తుంటారు. మొత్తం కాయితీ లంబాడీల సంఖ్య దాదాపు 80 వేల దాకా ఉంటుంది. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ జీవనాన్ని ఎక్కువగా పాటించే మధురలు. సంసృతీ, సంప్రదాయాలు.. ఆచార వ్యవహారలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.

ఇండో పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సంచార జాతులుగా పశుపోషణ, ఉప్పు వ్యాపారం చేస్తూ జీవనం సాగించే కాయితి లంబాడీలు.. క్రమంగా సిక్కు భోదనల ప్రభావం వల్ల కల్సాలో పాలుపంచుకున్నారు. అదే క్రమంలో 1707, 1708 సంవత్సరాల కాలంలో గుజరాత్, రాజస్ధాన్ ప్రాంతాలకు సైతం వలసలు సాగించారు. మరాఠీ రాజుల యుద్ధాల్లోనూ సహాయ సహకారాలు అందించారు. కాయితీ లంబాడీలు తదనంతర కాలంలో కాయితీలలో కొందరు మధురకు వెళ్లి స్ధిరపడ్డారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ప్రాంతాలకు వలస వచ్చి ఇక్కడే స్ధిరనివాసం ఏర్పరచుకొని ఇక్కడే జీవిస్తున్నారు. మధుర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు కాబట్టి.. వీరిని మధుర లంబాడీలు అని పిలుస్తుంటారు. మధురలు నేటికి కూడా పశుపోషణ, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

మధురల తండాల్లో ఎక్కడ చూసినా పెంకుటిల్లులు, పూరిగుడిసెలే. వారి పేదరికాన్ని అవి ప్రతిబింబిస్తుంటాయి. కర్రలతో కట్టిన ఇంటికి.. ఇప్పటికీ పేడ, ఎర్రమట్టి కలిపి..అలికి పూస్తుంటారు. ఏ ఇంటి లోపల చూసినా ధాన్యం బస్తాలు కనిపిస్తుంటాయి. తండాల్లో చాలామంది యువత పొద్దునే సద్దులు కట్టుకొని పొలాలకు వెళ్లి పనులు చేసుకుంటుంటారు.

కాయితీ లంబాడీలు నివసించే ఏ తండాలకు వెళ్లినా.. పశుసంపద అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. ప్రతి ఇంటి ఆవరణలో తప్పని సరిగా పశువులు ఉంటాయి. అనాదిగా పశువులతో ముడిపడిన వీరి జీవితం.. నేటికి వాటి సావాసంతోనే కొనసాగుతోంది అనేదానికి నిదర్శనంగా.. పాడి సంపద కనువిందు చేస్తుంటుంది. వీరంతా సన్నకారు రైతులు కూడా. కుటుంబానికి ఎకరానో రెండెకరాలో కలిగి ఉంటారు. పొలం లేకుంటే పశువులను పెంచుకుంటూ.. కైకిళ్లకు వెళ్లి సంపాదించుకుంటుంటారు. అలా పాడి పంటల తోడుగా వీరి జీవనం సాగుతుంది. ముఖ్యంగా మధురలు వరి,మొక్కజొన్న,సోయా పంటలను ఎక్కువగా పండిస్తారు.ఈ ప్రాంతంలో భూములు సారవంతమైన నల్లరేగడి భూములు అయినప్పటికీ నీటి వసతి లేకపోవడంతో కేవలం వర్షాధార పంటలు మాత్రమే పండుతాయి. బోరు వసతి ఉన్నవారు యాసంగి పంట పండిస్తారు. లేని వాళ్లు వానాకాలం పంటతో కైకిళ్లతో కాలం వెళ్లదీస్తారు.

కాయితీ లంబాడీ మహిళలు సంప్రదాయ వేషధారణ చాలా భిన్నంగా కనిపిస్తుంది. వీరు నిలువు కొప్పులను వేసుకొని అందంగా అలంకరించుకుంటారు. తలపై వెంట్రుకలను జడ అల్లి గట్టి బట్టలను వేసి నిలువగా కుట్టిన డోరా సాయంతో జడను కలిపి నిలబెట్టి, అక్కడ రాకిడిని ఉంచి.. పైనంగా బట్టతో కప్పి జడవేసుకుంటారు. దీన్నే చుండ అంటారు. నేటి తరం మహిళలు కొంత మంది చుండాలు తక్కువగా వేసుకుంటున్నా.. పాత తరం మహిళలు మాత్రం తప్పకుండా చుండాతోనే కనిపిస్తారు. ముఖ్యంగా సాంప్రదాయాలు పాటించే క్రమంలో చుండా లేనిదే బైటికి రారు. చుండాతోపాటు కానుగత్ దారంతో ముడివేసి ఉండే భీడ్ అనే చెవిదుద్దులు పెట్టుకుంటారు. కాస్తా కలిగిన వాళ్లు బంగారు బీడ్‌లను ధరిస్తే.. చాలా మంది మహిళలు వెండి బీడ్‌లను ధరిస్తారు. వీటితోపాటు మెడలో లేత పసుపురంగు కలిగిన పూసల హారం కట్టి.. అర్ర అనే పూసల దండలను కూడా ధరిస్తారు. బక్యా అనే చేతిపట్టీని, పుల్లి అనే ముక్కుపుడకను ధరిస్తారు. వీటితోపాటు కాళ్లకు ఛూడా అనే ప్రత్యేకమైన నగలను ధరిస్తారు. ఎక్కువ మంది మహిళలు సాంప్రదాయ భాష’లబానా’నే ఎక్కువగా మాట్లాడతారు. చాలా తక్కువ మంది వచ్చి రాని తెలుగు మాట్లాడతారు.

మధుర లంబాడీ మహిళలు పెళ్లిళ్ల సమయంలో, శుభకార్యాల సమయంలో సాంప్రదాయ పాటలు పాడుకుంటారు. గోకులాష్టమి, బాలాజీ మహాలక్ష్మికి పూజల సమయంలో ఒక రకమైన పాటలు పాడుకుంటారు. రెండూ వినడానికి వినసొంపుగా ఉన్నా ఆలోచిస్తే వాటిలో వైవిధ్యం కనిపిస్తుంది. అంతేకాదు శ్రావణ మాసం మొదలు దసరా వరకు చాలా శుభప్రదమైన సమయంగా పరిగణిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో పనులన్నీ పక్కనపెట్టి దైవాన్ని స్మరిస్తూ సాంప్రదాయబద్ధంగా నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

మధురలు శ్రీకృష్ణుడిని, వెంకటేశ్వరస్వామిని ఎక్కువగా పూజిస్తారు. భవాని సేవాలాల్‌లను కూడా పూజిస్తారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అష్టమి రోజున 12 గంటలపాటు కఠిన ఉపవాసం చేస్తారు. ఆ తర్వాత మట్టితో కృష్ణుడి మూర్తి తయారుచేసి.. రకరకాల నైవేద్యాలను వండి మోదుగాకులలో చుట్టి భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సాధారణంగా లంబాడీలు జంధ్యాలను ధరించరు కానీ, వీళ్లు జంధ్యాలను ధరించి పూజాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు.

కాయితీ లంబాడీలలో పురుషులు కూడా ఆటవిడుపుగా ప్రాచీన చోపెట్.. అంటే పాచికలతో పచ్చీసు లాంటి ఆటను ఆడుతుంటారు. దీంతోపాటు గోకులాష్టమి రోజు డప్పు వాయించుకుంటూ శ్రీకృష్ణుడి కీర్తనలతో భజనలు చేస్తూ.. పూజలు చేస్తారు. తిరుపతి బాలాజీ పూజల సమయంలో చాలా నియమనిష్టలు పాటిస్తారు. నదీ పరివాహకంలో శనగ గుడాలను సమర్పిస్తారు. అష్టమి ఉపవాస దీక్షసమయాల్లో గోధుమపిండితో తయారు చేసిన మాల్ పూరీలను, సిరాను ఫోలెలను సమర్పించి.. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వేడుక చేసుకుంటారు.

ప్రస్తుతం సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా మధురల పరిస్థితి అంత మెరుగ్గా లేదు. తండాల్లో సమస్యలతో సావాసం చేస్తూ.. జీవితాలు నెట్టుకొస్తున్నవారే ఇక్కడ ఎక్కువ. అంతో ఇంతో సాగుభూమి ఉన్నా, కేవలం వర్షాధార పంటలే పండే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మరుగుదొడ్లు లేక మహిళలు అవస్ధలు పడాల్సిన పరిస్ధితి నెలకొంది. చాలాతండాలలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. వారానికి రెండు రోజులు వచ్చే నీరు సరిపోక.. గ్రామంలో ఉన్న బోర్లపై ఆధారపడుతున్నారు. అవి కూడా పని చేయకపోతే వీరికి మంచినీటికి కటకటే.

ఇక విద్యకు కూడా దూరంగానే ఉన్నారు.. చాలా మంది మధురలు. చదివినా ఉద్యోగాలు రాక మళ్లీ పొలాల బాట పట్టి.. చెట్లూపుట్టలు పట్టుకుని తిరిగే పరిస్థితే ఉంటుందని కొందరు తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొందరు మాత్రం.. తమలా తమ బిడ్డల బతుకులు కూడా కైకిళ్లకు పరిమితం కావొద్దని.. కష్టమైనా పిల్లల్ని చదివిస్తున్నారు. తండాలకు దగ్గర్లోని స్కూళ్లకు పంపుతున్నారు. తమకూ రిజర్వేషన్లు వస్తే తమ బతుకులుబాగు పడతాయంటున్నారు.

అన్ని వర్గాల కంటే తాము చాలా వెనుకబాటుతనంలో ఉన్నామని, అటు రాజకీయ పరంగా, ఇటు ఆర్థిక సామాజిక పరంగా అభివృద్ది అన్నదే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయితీ లంబాడి నాయకులు. 1976లో లంబాడీలతోపాటు తమకు రిజర్వేషన్లు కల్పించారని, కానీ 1985 ప్రాంతంలో తాము అభివృద్ధి చెందిన వారమంటూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి.. తమను ఎస్టీ రిజర్వేషన్ల నుంచి దూరం చేసి BC-D కేటగిరీలో చేర్చిందని చెబుతున్నారు. దీని వల్ల గత 38 ఏళ్లుగా తాము తీవ్రంగా నష్టపోయామని, దాదాపు వందేళ్లు వెనక్కి వెళ్లిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితకాలం ఎలాగూ అయిపోయింది… ఇక తమ పిల్లల జీవితాలు అయినా బాగుపడితే చాలని కోరుకుంటున్నారు. తమలోని రైతులకు సబ్సిడీ రుణాలు అందాలన్నా… తమకు రిర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తమను ఎస్టీలుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతించారు. అయితే తీర్మానాన్ని కేంద్రానికి పంపించి వదిలేయడం కాకుండా.. ఒత్తిడి పెంచి అక్కడ కూడా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కాయితీ లంబాడీల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ కాయితీ లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ వర్తించేలా నిర్ణయం తీసుకోవాలని.. అప్పుడే తమకు ప్రభుత్వాలపై నమ్మకం ఏర్పడుతుందని గతంలో చెప్పారు.

హక్కుల కోసం, అస్తిత్వం కోసం గళం విప్పుతూ.. తమ వెనుకబాటుతనానికి పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు మధురలు. ఒక చిన్న జీవోతో తమ రిజర్వేషన్ హక్కులను కాలరాసిన నాటి పాలకులు.. తమ అభివృద్ధిని అధఃపాతాళానికి నెట్టేశారని, ఇకనైనా తమ బతుకులకు ఓ దిక్సూచి చూపి తమ జాతికి రిజర్వేషన్ ఫలాలు అందించాలని కోరుతున్నారు.

Share the post

Janatha Garage Special Story : మధుర లంబాడీలు.. చేజారిన రిజర్వేషన్ల కోసం పోరాటం..

×

Subscribe to "big Tv - తెలుగు Breaking News | 24x7 Live News Updates న్యూస్ ఛానల్"

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×