Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Nara Chandrababu Naidu : ప్రజల గుండెల్లో ఉన్నా.. చంద్రబాబు ఎమోషనల్.. ప్రజలకు బహిరంగ లేఖ..

Nara Chandrababu Naidu : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ములాఖ‌త్‌ సమయంలో తనను క‌లిసిన కుటుంబ ‌స‌భ్యుల‌కు తెలుగు ప్రజలనుద్దేశించి రాసిన లేఖను అందించారు. “జైలులో లేను.. అందరి గుండెల్లో ఉన్నా. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నా. విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నా. ప్రజలే నా కుటుంబం” అని అందులో పేర్కొన్నారు.

జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తుంటే.. 45 ఏళ్ల తన ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోందన్నారు చంద్రబాబు. తన రాజకీయ ప్రస్థానం తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని వివరించారు. అందుకు ఆ దేవుడితోపాటు ప్రజలే సాక్ష్యమన్నారు. ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారని పేర్కొన్నారు. తాను ప్రజల మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటాని వివరించారు.

కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరని స్పష్టం చేశారు. ఈ చీకట్లు తాత్కాలికమేనని.. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయన్నారు.సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్నారు. జైలు గోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు. జైలు ఊచలు తనను ప్రజల నుంచి దూరం చేయలేవన్నారు. తాను తప్పు చేయను.. చేయనివ్వనని స్పష్ట చేశారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరన్నారు. 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను చెరిపేయలేరని స్పష్టం చేశారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందన్నారు. తాను త్వరలో బయటకొస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని లేఖలో చంద్రబాబు వివరించారు.

దసరాకి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమండ్రి మహానాడులో ప్రకటించాని చంద్రబాబు గుర్తు చేశారు. అదే రాజమండ్రి జైలులో తనను ఖైదు చేశారని మండిపడ్డారు. త్వరలో బయటకొచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని ప్రకటించారు. తన ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్‌ కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ బయటకు రాని తన భార్య భువనేశ్వరిని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని కోరానన్నారు. అందుకు ఆమె అంగీకరించారని తెలిపారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు. అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ భువనేశ్వరి ముందుకు వస్తున్నారని ప్రకటించారు.

జనమే తన బలం, ధైర్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశవిదేశాల్లో తన కోసం రోడ్డెక్కి ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారు. తన క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయన్నారు. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమోకానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమేనని స్పష్టం చేశారు. ప్రజల అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకు వస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంత వరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్టు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందని పేర్కొంటూ ప్రజలకు చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖను ముగించారు.

Share the post

Nara Chandrababu Naidu : ప్రజల గుండెల్లో ఉన్నా.. చంద్రబాబు ఎమోషనల్.. ప్రజలకు బహిరంగ లేఖ..

×

Subscribe to "big Tv - తెలుగు Breaking News | 24x7 Live News Updates న్యూస్ ఛానల్"

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×