Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Vijayawada: ఆ ఇద్దరు ఢీ అంటే ఢీ.. వివాదాల ఇంద్రకీలాద్రి!

Vijayawada: విజయవాడలో కొలువైన కనక దుర్గమ్మ ఆలయం వివాదాలకు నిలయంగా మారింది. దుర్గగుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మధ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఏపీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయం గురించి తెలియని తెలుగువారుండరు. కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా విజయవాడ దుర్గమ్మను భక్తులు కొలుస్తారు. అలాంటి మహోన్నత ఆలయం ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువై వార్తల్లోకెక్కుతుంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబ వ్యవహారంపై పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు బహిరంగంగ విమర్శలకు దిగారు. ఆలయ ఈవో భ్రమరాంబ.. పాలక మండలి లేఖలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏసీబీకి పట్టుబడి అరెస్టయిన సూపరింటెండెంట్‌ నగేశ్‌కు కీలక బాధ్యతలను అప్పగించడమేంటని నిలదీశారు రాంబాబు. ఈ విషయాలన్నింటిని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఛైర్మన్‌ రాంబాబు ప్రకటించడంతో దుర్గగుడి వివాదం ఆసక్తిగా మారుతోంది.

అవినీతి వ్యవహారం దుర్గగుడిపై దుమారం రేపుతోంది. సూపరింటెండెంట్‌ నగేష్‌.. ద్వారకా తిరుమలలో పని చేసినప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణ అధికారిగా దుర్గగుడి ఈవో భ్రమరాంబ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనేక ఆరోపణలున్న వ్యక్తికి ఇప్పుడు కీలక బాధ్యతలను ఎలా అప్పగిస్తారంటూ పాలక మండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు మండిపడుతున్నారు. నగేష్‌ బాధ్యతలను మార్చాలని కోరితే.. ఇంత వరకు ఈవో స్పందించడంలేదన్నారు ఛైర్మన్‌ రాంబాబు. పాలక మండలి వచ్చి మూడు నెలలైనా.. రెండో బోర్డు సమావేశం నుంచే తాము నగేష్‌ తీరును తప్పుపడుతున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటని నిలదీస్తున్నారు ఛైర్మన్‌ రాంబాబు. వేతన కోతతో విధులు నిర్వహిస్తోన్న సూపరింటెండెంట్‌కు కీలక బాధ్యతలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

సూపరింటెండెంట్‌ నగేష్‌.. ఓ పెద్ద లాబీయింగ్‌ మాస్టారని.. ఏసీబీ దాడులతో ఆ విషయం స్పష్టమైందంటున్నారు ఛైర్మన్‌. పాలక మండలిని ఈవో ఎంత మాత్రం గౌరవించడంలేదని పాలకమండలి ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లరి అవుతున్న పరిస్థితుల్లో చక్కదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది.. అందుకే ఈ విషయాన్ని కమిషనర్‌, దేవదాయ శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఛైర్మన్‌ రాంబాబు.

దుర్గగుడి హుండీల లెక్కింపు సమయంలో అక్కడ పరిస్థితులనుర ఈవో భ్రమరాంబ పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో పాలకమండలి ఛైర్మన్‌.. మహామండపం ఆరో అంతస్తుకు వచ్చి.. నగేష్‌ వ్యవహారంపై అందరి ముందు ప్రశ్నించినట్టు సమాచారం. సూపరింటెండెంట్‌ నగేష్‌ను సస్పెండ్‌ చేయనున్నారని.. అతని స్థానంలో ఎవరిని నియమిస్తారనేది వెంటనే చెప్పాలని ఛైర్మన్‌ రాంబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఉన్నందున.. ఈ విషయమై తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అయినా వినని ఛైర్మన్‌.. నగేష్‌ స్థానంలో తాను సూచించిన వ్యక్తిని నియమించాలని పట్టుబట్టారు. ఈవో భ్రమరాంబ స్పందించకపోవడంతో పాలకమండలి ఛైర్మన్‌ రాంబాబు మరింత ఆగ్రహానికి గురైనట్లు అక్కడి నుంచి తెలిసిన సమాచారం.

విజయవాడ దుర్గగుడి ఆలయ ఈవో పై విమర్శలు చేయడం తగదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కొంతమంది తమ ఇష్టనుసార పనులు కావడంతో ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఈవో పై దేవాదాయశాఖ మంత్రిని కాదని సీఎంకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటిని మంత్రి మండిపడ్డారు. వివాదంపై విచారణ కోసం.. సీఎం కార్యాలయానికి వెళ్లినా తిరిగి ఆ విషయం తన వద్దకే వస్తుందన్నారు.

అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ. అలాంటి దుర్గమ్మ సన్నిధిలో ఆధిపత్య పోరు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ఫిర్యాదులు, రాజకీయ అండదండలు ఇంద్రకీలాద్రీ విభేదాలకి చిరునామాగా మారింది. రానున్న రోజుల్లో ఈవో, ఛైర్మన్‌ మధ్య వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.

Share the post

Vijayawada: ఆ ఇద్దరు ఢీ అంటే ఢీ.. వివాదాల ఇంద్రకీలాద్రి!

×

Subscribe to "big Tv - తెలుగు Breaking News | 24x7 Live News Updates న్యూస్ ఛానల్"

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×