Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Assembly Election 2023: మేనిఫెస్టోల మాయ.. వేస్తారా జనాలు ఓట్లు.. ఈసారి ఏమవుతుందో?

Assembly Election 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు ఇస్తే బీఆర్‌ఎస్‌ ఆ గ్యారంటీలకు గ్యారంటీ ఇస్తున్నట్లగా అంత కంటే ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీకి గ్యారంటీలు ఓ ప్రాథమిక హామీ మాత్రమే. అసలు మేనిఫెస్టోలో తులం బంగారం లాంటి హామీలు ఉంటాయని టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలోనే ప్రకటించారు. ఇక బీజేపీ ఉండనే ఉంది. వీరి మేనిఫెస్టోలన్నీ పథకాల పండగ చేసేవే. అయితే ప్రభుత్వం లేదా రాజకీయ నాయకుడు ఓ నోటు ప్రజలకు పంచాడంటే అది వారి సొమ్ము కానే కాదు. అది ప్రజలదే.. ఇందులో మరో మాటకు చాన్సేలేదు.

పార్టీల ఉచితాల పోటీ..
బీఆర్‌ఎస్‌ 2014లో తెలంగాణ తెచ్చామంటూ చెప్పుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2018 ముందస్తు ఎన్నికల్లో సంక్షేమ కార్యక్రమాలను ముందుపెట్టి ఎలక్షన్లలో గట్టెక్కింది. ఇప్పుడు మూడోసారి ఆ రెండు ఎన్నికల్లో చెప్పిన అంశాలను మరుగు పరిచే విధంగా మరికొన్ని హామీలను గుప్పించింది. అయితే గతంలో చెప్పిన వాగ్దానాలకే బడ్జెట్‌ తడిసి మోపెడవుతోంది. ఆ భారం భరించలేక అనేక ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయి. వీటిలో కొన్ని అటకెక్కాయి కూడా. ఇప్పుడు కాంగ్రెస్‌కు పోటీగా హామీల్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లో చర్చకు పెడుతోంది. అర్హులైన పేదలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్, అర్హులైన మహిళలకు రూ.2,500 పింఛన్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం తదితర అంశాలు ఉన్నాయి. నువ్‌ లక్ష ఇస్తానంటే నేను రెండు లక్షలు ఇస్తాననే హామీలు పోటాపోటీగా ప్రకటించకబోతున్నారు. అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల తాట తీయడం ఖాయం. మీరు విన్నది నిజమే. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల పంట పండుతుందని అనుకుంటే పొరపాటు. ఎవరు వచ్చినా ప్రజల తాట తీస్తారు. వారి దగ్గర నుంచి వసూలు చేసే డబ్బుల్లోనే కొంత పంచుతారు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రజల దగ్గర నుంచే.

ఖర్చు వేల కోట్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో గెలవడానికి అధికారంగా పథకాల పేరుతో కనీసం వేయి కోట్లకుపైగా ఖర్చుపెట్టారు. ఇందులో దళితబంధు సహా అన్ని రకాల పథకాల పేరుతో నేరుగా ఓటర్లకు నగదు చేసిన పథకాలు ఉన్నాయి. అభివృద్ధి పనుల పేరుతో అప్పటికప్పుడు ఖర్చు పెట్టినవీ ఉన్నాయి. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ప్రభుత్వం అధికారికంగా ఖర్చు పెట్టింది కూడా అంతే ఉండొచ్చు. ఇక రాజకీయ పార్టీల ఖర్చు గురించి చెప్పాల్సిన పనిలేదు. నెలన్నరపాటు మద్యం ఏరులై పారింది. ఓట్ల కొనుగోలుకు ఒక్కో ఓటుకు ఐదు వేలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల కేసీఆర్‌ మాత్రమే కాదు..అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ఒక చోట అనుకూల ఫలితం.. మరో చోట వ్యతిరేక ఫలితం వచ్చింది. కానీ ఖర్చయింది ఎవరికి ?. కేసీఆర్‌కు, బీజేపీకి .. కాంగ్రెస్‌ పార్టీకి రాజగోపాల్‌రెడ్డికి ఖర్చయిందని సామాన్య ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం ఖర్చయింది ప్రజల సొమ్మే. రెండు ఉపఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్‌ చేసిన ఖర్చు ప్రజల పన్నుల నుంచి సేకరించిందే. ప్రభుత్వ పరంగానే కాదు.. పార్టీల పరంగా చేసే ఖర్చులు కూడా ప్రజలవే. రాజకీయ నేతలు పార్టీలు సొంతంగా డబ్బులు సంపాదించుకోవు. ప్రజల డబ్బుల్లో వివిధ మార్గాల్లో సమీకరించకుంటాయి. అధికారంలో ఉన్న పార్టీలు వేల కోట్లు ఇలాగే వెనకేసుకుని ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఉంటాయి. ప్రజల సంపదను స్వాహా చేసి ఎన్నికల్లో ఖర్చు పెడతారన్నమాట.

హైదరాబాద్‌ భూములు అమ్మి..
పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చంతా ప్రజల డబ్బే. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజా ఆస్తులను నిస్సంకోచంగా వేలం వేస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రజల ఆస్తి అయిన వందల ఎకరాల అత్యంత విలువైన భూముల్ని రాత్రింబవళ్లు వేలం వేసి వచ్చిన డబ్బులతో స్కీమ్స్‌ అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరం పెరుగుతోంది. రేపు ప్రజావసరాలకు అవసరమైన కట్టడాల కోసం స్థలాలు కావాలంటే ఏం చేస్తారు ?. మళ్లీ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేసి రైతుల దగ్గరే లాక్కుంటారు. ఈ సైకిల్‌ ఇలా కొనసాగుతుంది. అంటే ప్రజల ఆస్తులు కూడా వేలం వేసి స్కీమ్స్‌ అమలు చేస్తున్నారన్నమాట. పెట్రోల్, డీజిల్‌ రేట్లు కర్ణాటక కన్నా తెలంగాణలో ఆరేడు రూపాయలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. అంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఎక్కువగా ఉంటాయి దానికి కారణం ఏమిటో సామాన్యులకు అర్థం కాదు.. తమను ప్రభుత్వాలు పిండుకుని వాటితో ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తున్నాయని అర్థం చేసుకోలేకపోతున్నారు.

రెండు విధాలుగా ఓట్ల కొనుగోలు..
మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ల కొనుగోలు. రెండు విధాలుగా ఓట్ల కొనుగోలు జరుగుతోంది. ఒకటి నేరుగా ఓటింగ్‌ రోజు లేదా ముందు రోజు.. ఓటర్‌ దగ్గరకు వెళ్లి రెండు వేలో, మూడు వేలో చేతిలో పెట్టి ఓటు కొనుక్కోవడం. రెండో విధానం ప్రభుత్వం తరపున ఓటు బ్యాంక్‌కు నగదు బదిలీ చేస్తూ ఉండటం. ఈ రెండు విధానాల్లో ప్రజలకు చేరే డబ్బు ప్రజలదే. పైగా వసూలు చేసినదంతా ఇవ్వరు. సగం అవినీతికి పోతే సగం మాత్రమే తిరిగి ఇస్తారు. కానీ ఈ విషయాన్ని గుర్తించేంత చైతన్యం ప్రజల్లో లేదు. ప్రజలకు వారిస్తున్న హామీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఒక్క ప్రశ్న ఆలోచిస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. కానీ అలాంటి ఆలోచన రాకుండా రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పన్నుల వడ్డింపు , ఆస్తుల అమ్మకం కాదు.. ప్రజల నెత్తి మీద అప్పులు రుద్దేస్తున్నాయి ప్రభుత్వాలు. స్కీములు.. స్కాముల కోసం లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాయి. ఆ అప్పులు తీర్చేందుకు మళ్లీ ప్రజలపైనే భారం వేస్తున్నాయి.

భారీగా అప్పులు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్ర అప్పులో తెలంగాణ వాటాగా 69వేల కోట్ల రూపాయల అప్పు వచ్చింది. ఇప్పుడు అది నాలుగున్నర లక్షల కోట్లకు చేరింది. భారత రాష్ట్ర సమితి చీఫ్‌ కేసీఆర్‌ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సంపదను కరిగించేస్తున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది. హైదరాబాద్‌ తప్ప.. జిల్లాల్లో ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీ ఇచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు లక్ష కోట్ల వరకూ పెండింగ్‌ లో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇన్ని సమస్యలతో ఇక బీఆర్‌ఎస్‌ వద్దని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూడాలని అనుకుంటున్నారని అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కాంగ్రెస్‌ కూడా కేసీఆర్‌ను మించిన పథకాలు అమలు చేస్తామని ప్రకటిస్తోంది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రానికి ఈ పథకాలను అమలు చేయాలంటే మరింత భారం అవుతుంది. దుర్భరం అవుతుంది. అంతిమంగా ప్రజలే ఇబ్బంది పడతారు.

బీజేపీ కూడా ఉచితాల బాట..
బీజేపీ ఇప్పటి వరకూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించనప్పటికీ దాని మేనిఫెస్టో సైతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు భిన్నంగా ఉండబోదు. హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఉచిత పథకాలను గమనిస్తే అర్థమవుతుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా పార్టీ ఏదైనా ఎలాంటి మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి..? వాటి అమలు సాధ్యసాధ్యాలేంటి? ఆర్థిక వనరులు ఎక్కడనుంచి సమీకరించుకుంటారు? అనే కీలకాం శాలు ప్రజల్లో చర్చ రాకుండా చేస్తున్నారు. అదే జరిగితే ప్రజలకు నిజం ఏమిటో తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రతి రూపాయి ప్రజలదే. వారికి ఓ పది రూపాయలు ఇచ్చారంటే అంతకు మించి వసూలు చేశారని ..లేదా చేస్తారని అర్థం. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించిన రోజున.. ఈ ఉచిత హామీల రాజకీయాలు మారిపోతాయి.

Share the post

Assembly Election 2023: మేనిఫెస్టోల మాయ.. వేస్తారా జనాలు ఓట్లు.. ఈసారి ఏమవుతుందో?

×

Subscribe to ‘మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ’లకు ఒక చిన్న హీరోకి ఉన్న ధైర్యం కూడా లేదా ?

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×