Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు - పార్ట్ 3


(పార్ట్ 2 తరువాయి బాగం)
.
3. సంస్కృత భాషోదయం
శాతవాహనులు ప్రాకృతాన్ని ప్రోత్సహిస్తూ సంస్కృతాన్ని అంతవరకూ తొక్కిపెట్టి ఉంటారని అందుచేతే శాతవాహన సామ్రాజ్యం (CE 3వ శతాబ్దం ) క్షీణించిన తరువాత క్రమక్రమంగా సంస్కృతం శాసనభాషగా కనిపించటం ప్రారంభమైందని Language of the Snakes పుస్తక రచయిత Andrew Ollett అభిప్రాయపడ్డాడు .
నిజానికి శాతవాహనులు పొరుగురాజైన నహాపణుని రాజ్యంలో అప్పటికే సంస్కృతం శాసనభాషగా వాడటాన్ని ప్రారంభించినట్లు – నాశిక్ లో 120 CE లో ఉషవదత్తు వేయించి ఒక శాసనంద్వారా తెలుస్తుంది. మనకు స్పష్టమైన తేదీని కలిగి ఉన్న సంస్కృత శాసనాలలో ఇదే మొదటిది . ఈ శాసనం కూడా పూర్తిగా సంస్కృతభాషలో ఉండదు. ఉషవదత్తును కీర్తించే సగభాగం సంస్కృతంలోను, అతను ఇచ్చిన దానం వివరాలు ప్రాకృతంలోను ఉండటం చూడవచ్చు. శాసనభాషగా ప్రాకృతం క్రమేపీ ప్రాధాన్యతకోల్పోతూ, సంస్కృతం ముందుకు వస్తున్న దశను ఉషవదత్తు వేయించిన ఈ మిశ్రమ శాసనం ప్రతిబింబిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను కీర్తిస్తూ అతని తల్లి గౌతమి బాలశ్రీ CE 1వ శతాబ్దంలో ప్రాకృతభాషలో వేయించిన నాసిక్ గుహ శాసనానికి కొద్ది దూరంలోనే CE 3 వ శతాబ్దంలో అగ్నివర్మ కుమార్తె అయిన విష్ణు దత్త ఇచ్చిన ఒక దానశాసనం పూర్తి సంస్కృతంలో ఉంటుంది.
శాతవాహనులవారసులైన ఇక్ష్వాకులు మొదట్లో ప్రాకృతంలో శాసనాలు వేయించినప్పటికీ క్రమేపీ నాలుగో శతాబ్దంలోని ఎహువల శాంతమూల హయాంకి వచ్చేసరికి వీరు కూడా సంస్కృతంలోకి మారిపోయారు. ఒక బౌద్ధ స్తూపంపై శాంతమూలుడు వేయించిన శాసనంలో -అగ్నిహోత్ర, అజితోమ, అశ్వమేధ లాంటి వైదిక క్రతువులను జరిపించినట్లు; పదివేల గోవులను దానమొసగినట్లు ఉండటం- క్రమేపీ బౌద్ధంనుంచి హిందూమతం దిశగా మారుతున్న విశ్వాసాలను ప్రతిబింబిస్తుంది. (EI 31: 63)
పాలకులు అంతవరకూ శాసనభాషగా ఉన్న ప్రాకృతాన్ని పక్కన పెట్టి సంస్కృతాన్ని ముందుకు తీసుకొని రావటం అనేది ధార్మిక విధులకు అవసరమైన సంస్కృతభాషను గుప్పెట్లో పెట్టుకొన్న పండితుల ఆధిపత్యాన్ని అంగీకరించటంగా అర్ధం చేసుకోవాలి.
నాలుగోశతాబ్దం తరువాత ప్రాకృతంలో వేయబడిన ఒక్క రాజ శాసనం కూడా లభించకపోవటాన్ని బట్టి అప్పటికి సంస్కృతం రాజాశ్రయం పొంది తన ప్రాబల్యాన్ని సంపూర్ణంగా స్థాపించుకొందని భావించాలి.
.
4. ఆధిపత్య భాషగా సంస్కృతం
.
సంస్కృతం అందరి భాషా కాదు. దాన్ని నేర్చుకొనే అర్హత కొందరికే ఉండేది. సమాజంలోని కొందరు సంస్కృతంపై మోనోపలి సాగించారు. BCE మూడో శతాబ్దానికి చెందిన మిమాంస సూత్ర (6.1.25–38) లో apasudradhikarana పేరుతో శూద్రుడు సంస్కృతం నేర్వరాదని, వేద విద్యలకు అనర్హుడని నిర్ణయించి భారతీయ సమాజంలో “సంస్కృత మొనోపలి”కి తెరతీసింది. తద్వార మతపరమైన గ్రంధాలకు జనబాహుళ్యం (శూద్రులు) దూరమయ్యారు. బ్రహ్మ సూత్ర (1.3.38), మనుస్మృతి (3.156) శూద్రునికి సంస్కృత వ్యాకరణం ఇతర శాస్త్రాలను బోధించటాన్ని నిషేదించాయి .
లోకాచారం ప్రకారం శూద్రులు నిర్వహించాల్సిన విధులను ఉపదేశిస్తూ CE 1580 లో శేషకృష్ణ రచించిన శూద్రచింతామణి అనే గ్రంధం – శూద్రులకు వేదాలు, సంస్కృతవ్యాకరణం, స్మృతులు, పురాణాలు నిషిద్దమని, శూద్రులు సంస్కృత పదాలను ఉచ్ఛరించటానికే అర్హతలేదని చెప్పింది.
BCE రెండోశతాబ్దానికి చెందిన పతంజలి తన సంస్కృత వ్యాకరణ గ్రంధం “మహాభాష్య” రాసే సమయానికి ప్రాకృతానికి-సంస్కృతానికి మధ్య గట్టి పోటీ నడిచేది. ప్రాకృతం ప్రజలు నిత్యం మాట్లాడుకొనే భాషగా జనబాహుళ్యంలో బాగా చొచ్చుకొని పోయి, సంస్కృతం కంటే చాలా ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలో సంస్కృత వ్యాకరణవేత్తలు ధార్మిక/మత భాషగా సంస్కృతమే ఉండాలని పట్టుపట్టారు. ఆ విధంగా ఒక మతకట్టుబాటు (Religious restriction) ఏర్పాటు చేసారు. లౌకిక వ్యవహారాలను ప్రాకృత భాషలో జరుపుకొన్నా యజ్ఞకర్మలకు తప్పనిసరిగా సంస్కృతాన్నే వినియోగించాలని పతంజలి అన్నాడు. (yajne karmani sa niyamah) .
బ్రాహ్మణ స్త్రీలు ప్రాకృతాన్ని మాట్లాడటం వలన సంస్కృతభాషలోకి అపభ్రంశ ఉచ్ఛారణలు వచ్చి చేరుతున్నాయని పతంజలి ఆరోపించాడు. బ్రాహ్మణుల చుట్టూ నివసించే చండాలురు, శూద్రులకు సంస్కృతంతో పని లేదు. ఆనాటి సమాజంలో వీరందరూ ఇంకా బ్రాహ్మణ స్త్రీలు కూడా ప్రాకృతాన్నే మాట్లాడేవారని పతంజలి మహాభాష్య ద్వార తెలుస్తుంది. దీనిని బట్టి అప్పట్లో సంస్కృతం మాతృభాష కాదని, బ్రాహ్మణ పురుషులు మాత్రమే దీన్ని ఒక ద్వితీయభాషగా (ప్రధమ భాష ప్రాకృతం) బ్రతికించుకొంటూ ఉండేవారని అవగతమౌతుంది.
అత్యధిక శాతం ప్రజలు సంస్కృతేతర స్థానిక భాషలను మాట్లాడేవారు. (Sanskrit and Prakrit: Sociolinguistic issues by Madhav M. Deshpande)
అయినప్పటికీ భారతదేశ సంస్కృతి, విజ్ఞానం, సంప్రదాయాలకు సంస్కృత భాష నేటికీ ప్రాతినిధ్యం వహించటం ఒక చారిత్రిక వైరుధ్యం. దీన్ని రెనో ఒక ఫ్రెంచి ఇండాలజిస్ట్ ప్రతిపాదించాడు కనుక ఈ వైరుధ్యాన్ని Renou’s “paradox” అంటారు. అనాదిగా సంస్కృతానికి ఇతర స్థానీయభాషలకు మధ్య ఘర్షణలు జరిగి ఉండాలి. సంస్కృతాన్ని మతపరమైన క్రతువులకు తప్పనిసరి చేసి, దాన్ని బ్రాహ్మణేతరులకు దూరం చేయటం ద్వారా సమాజంలో బ్రాహ్మణిజపు ఆధిపత్యానికి తెరలేపటం జరిగింది.
***
5. సంస్కృత భాషా పరిణామం
2000-1500 BCE : హరప్ప నాగరికత పతనానికి రుగ్వేద రచనకు మధ్య కాలమిది. ఈ కాలంలోనే Proto Indo European Language అనే మూలభాషనుంచి సంస్కృతం, Mycenaean Greek, Ancient Greek, Hittite లాంటి భాషలు రూపుదిద్దుకొని ఉంటాయని భాషా పండితుల అభిప్రాయం.
అలా అవతరించిన సంస్కృతభాష ప్రాచీన భారతదేశంలో విస్తృతమైన మార్పులకు గురయ్యి వైదిక సంస్కృతంగా కావ్యభాషా రూపాన్ని పొందింది.
1500 - 500 BCE : ఈ కాలంలో సంస్కృతభాష పరిపక్వత పొంది వైదిక సంస్కృతంగా నిలిచింది. దీనిలో మానవేతిహాసపు అత్యంత ఉత్కృష్టమైన రుగ్వేద రచన జరిగింది. కానీ దీనికి సంబంధించిన రాతపూర్వక ఆధారాలు ఇప్పటివరకూ లభించలేదు. ఇవన్నీ ఎక్కువగా మత సంప్రదాయాలకు సంబంధించిన శ్లోకాలు కనుక అవి మౌఖికంగా ఒక తరం నుండి మరో తరానికి అందించబడిఉండొచ్చు.
500-400 BCE : బుద్ధుడు, మహావీరుడు తమ మత బోధనలను అప్పటికే మతభాషగా స్థిరపడిన సంస్కృతంలో కాక ప్రాకృతభాషలలో చేయసాగారు. దీనికి - ప్రాకృతం ప్రజల భాష అని భావించటం; ఏమత క్రతువులనైతే తాము వ్యతిరేకిస్తున్నామో, ఆ మతవ్యవహారాలను నిర్ధేశించే సంస్కృతాన్ని, దాన్ని గుప్పెట్లో పెట్టుకొన్న బ్రాహ్మణిజపు ఆధిపత్యాన్ని బద్ధలు కొట్టాలనుకోవటం కారణాలు కావొచ్చు.
బౌద్ధమతాన్ని స్థాపించిన బుద్ధుడు, జైన మతస్థాపకుడైన మహావీరుడు క్షత్రియవర్ణానికి చెందిన వ్యక్తులు. బౌద్ధసాహిత్యంలో వర్ణక్రమంలో బ్రాహ్మణులు క్షత్రియులు కంటే తక్కువవారని పదే పదే చెప్పబడింది. బౌద్ధ, జైన మత ఉత్థానపతనాలను బ్రాహ్మణ క్షత్రియ వర్ణాల మధ్య ఆధిపత్యపోరుగా అభివర్ణిస్తారు కొందరు చరిత్రకారులు.
300 BCE : అశోకుడు బౌద్ధధర్మ ప్రచారంలో భాగంగా తన రాజ్యంపొడవునా ప్రాకృతబాషల్లో సుమారు 84 వేల రాతిశాసనాలను, స్తూపాలను ఏర్పాటు చేసాడు.
200 BCE -7 CE: సంస్కృతభాష రాజాదరణ పొంది, నాగరీకుల భాషగా గౌరవం దక్కించుకోసాగింది. అంతవరకూ ప్రాకృతభాషలో వేయబడిన రాజశాసనాల స్థానంలో సంస్కృత శాసనాలు- భారతదేశంలోనే కాక వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా వేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బౌద్ధ జైనాలు కూడా తమ బోధనలను సంస్కృతభాషలో చేయటం మొదలుపెట్టక తప్పలేదు.
మొదట్లో పాలి భాషలో లిఖించబడిన బౌద్ధ సాహిత్యం క్రమేపీ సంస్కృతీకరించబడటం మొదలైంది. ఒకటవ శతాబ్దపు అశ్వఘోషుడు బుద్ధచరితను సంస్కృతంలో రచించాడు. ఏడవశతాబ్దంలో హ్యుయాన్ త్సాంగ్ నలందవిశ్వవిద్యాలయంలో బౌద్ధ సాహిత్యాన్ని సంస్కృత భాషలోనే నేర్చుకొన్నాడు.
జైనం మాత్రం సంస్కృతాన్ని ఏడో శతాబ్దం వరకూ కూడా మతభాషగా అంగీకరించలేదు. ఈ విషయంలో జైనం సంస్కృతబాషకన్నా ప్రాకృతభాష సొబగైనదని, అది ప్రజల భాష అని నమ్ముతూ సైద్ధాంతికంగా బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఏడవశతాబ్దంలో సిద్ధసేన దివాకరుడు రాసిన "సన్మతితర్క" అనే గ్రంధం సంస్కృతంలో వెలువడిన మొదటి జైన సాహిత్యం.
***
ప్రాకృతభాష సంస్కృతంతో పోటీ పడలేక వెనుకబడినప్పుడు, దానిలో ఉన్న సాహిత్యం సహజంగానే మరణించాలి. కానీ చిత్రంగా సంస్కృత పండితులు ప్రాకృతసాహిత్యంలోని ముఖ్యవిషయాలను సంస్కృతకావ్యాలలోకి తీసుకొని వచ్చారు. ఈ అంశంపై V.M. Kulkarni విస్తృతంగా పరిశోధన చేసి "Prakrit Verses in Sanskrit Works on Poetics" పుస్తకాన్ని రచించాడు. దీనిలో వివిధ సంస్కృత ఆలంకారికులు, గ్రంథకర్తలు ప్రాకృత సాహిత్యంలోని కొన్ని వేల వర్ణనలను తమ రచనలలో ఎలా స్వీకరించారో/ఉటంకించారో విపులంగా చర్చించాడు
ఉదాహరణకు
ఐదో శతాబ్దానికి చెందిన కాళిదాసు కుమారసంభవం కావ్యంలో ఒక శ్లోకం ఇలా ఉంటుంది
రతిక్రీడాసమయంలో శివుడు పార్వతీదేవి వస్త్రములను లాగివేయగా ఆమె సిగ్గుతో శివును రెండు నేత్రాలను తన చేతులతో కప్పివేసినది. అయినప్పటికీ శివుడు తన మూడవనేత్రంతో ఆమె శరీర అందాలను చూస్తూండటంతో తన ప్రయత్నం వృధా అయినందుకు పార్వతీదేవి మిక్కిలి దుఃఖించినదట. (కుమారసంభవం-VIII-7)
దాదాపు ఇదే వర్ణన ఒకటో శతాబ్దపు ప్రాకృత గాథాసప్తశతిలో ఇలా ఉంది
శివపార్వతుల సంగమ సమయంలో
వలువలు తొలగగా సిగ్గిల్లిన పార్వతీదేవి
రెండుచేతులతో విభుని రెండు కళ్లూ మూసి
మూడవకంటిని ముద్దాడింది. – 455
ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోక ఆలంకార శాస్త్ర గ్రంథంలో వాక్పతిరాజు రచించిన గౌదావహో అనే ప్రాకృత కావ్యం నుంచి ఈ వర్ణనను - సర్వం కోల్పోయిన స్థితిని ధ్వన్యాత్మకంగా చెప్పటానికి ఒక ఉదాహరణగా వాడుకొన్నాడు.
ఆకాశంలో మబ్బులు సోలిపోయి తూలుతూ తిరుగుతున్నాయి
కుండపోతగా కురుస్తున్న వర్షపుధారలకు అర్జున వృక్షాలు వణికిపోతున్నాయి
చంద్రుని గర్వం అణిగిపోయింది, చీకటిరాత్రులు వెంటాడుతున్నాయి. (గౌదావహో 416 – ప్రాకృత కవి వాక్పతిరాజు)
***
6. ముగింపు
ఏది ఏమైనప్పటికీ సంస్కృత బాష- మతక్రతువులపై తన సంపూర్ణ ఆధిపత్యం ద్వారా; రాజాదరణ పొందటం ద్వారా; ఒక సామాజిక వర్గానికి తప్ప మిగిలినవారికి అందుబాటులో లేనికారణంగా - కాలానుగుణంగా భిన్న భాషల మధ్య, భిన్న మతాల మధ్యా మనుగడకోసం జరిగిన పోరాటంలో తాను విజేతగా నిలవటమే కాక, తనకు ప్రాపకం కల్పించిన హిందూ ధర్మానికి కూడా విజయాన్ని అందించింది.
.
బొల్లోజు బాబా
.
సంప్రదించిన పుస్తకాలు
1. Andrew Ollett, Language of the Snakes
2. Language of the Gods in the world of Men, Sheldon Pollock
3. Sanskrit and Prakrit: Sociolinguistic issues by Madhav M. Deshpande
4. ప్రాకృత గ్రంథ కర్తలూ, ప్రజాసేవాను – పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి
5. Andrew Ollett, Language of the Snakes
6.Classical Buddhism, Neo Buddhism and the question of Caste, Pradeep P. Gokhale
7. V.M. Kulkarni "Prakrit Verses in Sanskrit Works on Poetics"
8. గాథాసప్తశతి వ్యాసాలు - బొల్లోజు బాబా
9. GAUDAVAHO by VAKPATIRAJA Prof. N. G. SURU.
10. A HISTORY OF INDIAN LITERATURE EDITED BY JAN GONDA
11. Contribution of Jainas to Sanskrit and Prakrit Literature, Dr. K.R. Chandra Commemoration Volume
12. Ideology and Status of Sanskrit Edited by Jan E.M. Houben
13. Wikipedia


This post first appeared on Poetry, please read the originial post: here

Share the post

ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు - పార్ట్ 3

×

Subscribe to Poetry

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×