Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘మోడీ’ ఇంటికే!

ప్రధాని నరేంద్రమోడీని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలో ఏర్పాటు చేసిన సభలో దేశంలోని కీలక పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మరి అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్లలతో మాస్టర్ స్ట్రోక్ ఇఛ్చిన మోడీని ఇంటికి పంపించటం వీరికి సాధ్యం అవుతుందా?. ఇంకా పన్ను  రాయితీలతో పాటు ఎన్నో కొత్త వరాలు మోడీ సర్కారు నుంచి  ఉండబోతున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఇన్ని ఆకర్షణీయ అంశాల మధ్య మోడీని ఓడించటం అంత తేలిగ్గా జరిగే పనేనా?. సరే ఈ అనుమానాలు ఎలా ఉన్నా..దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకమై తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వీళ్లకు కాంగ్రెస్ పార్టీకి జోడీగా నిలిచింది. విభేదాలు పక్కన పెట్టి మరీ మోడీని దించటమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తన వంతు పాత్ర పోషించారు. త్వరలో ఆయన అమరావతిలో కూడా దేశంలోని కీలక పార్టీలతో ఇదే తరహా సమావేశం పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, హస్తినలో ప్రభుత్వం మారాల్సిందేనని ముక్తకంఠంతో నినదించాయి. ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ సహా 20 ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికలు ముగిసిన తరువాతే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించారు. ర్యాలీకి టీఎంసీ కార్యకర్తలు లక్షల్లో వచ్చారు. కోల్‌కతా విపక్ష సభ సక్సెస్‌ కావడంతో పార్టీల్లో జోష్ వచ్చింది. మోదీ ప్రభుత్వంపై ఈ ర్యాలీకి అధ్యక్షత వహించిన మమత మోడీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మార్పు రావాలంటే ఢిల్లీలో ప్రభుత్వం మారాలని ఉద్ఘాటించారు. సమష్టి నాయకత్వం గురించి తరచూ మాట్లాడే మోదీ, అమిత్‌ షాలు బీజేపీ సీనియర్‌ నాయకులు సుష్మా స్వరాజ్, గడ్కరీ, రాజ్‌నాథ్‌ తదితరులకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధ సంస్థలు సీబీఐ, ఆర్‌బీఐ, ఇతర విచారణ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు.

మొండి బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయని, రఫేల్‌ లాంటి కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. కాంగ్రెస్‌ తరఫున హాజరైన సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. సోనియా పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. సోనియా, రాహుల్‌ గాంధీలు ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. ‘మోదీ తాను తినకపోయినా తన కార్పొరేట్‌ స్నేహితులు అంబానీలు, అదానీలకు లబ్ధి చేకూరుస్తున్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. గమ్యస్థానం చాలా దూరం ఉంది. దారి  క్లిష్టంగా ఉంది. కానీ మనం అక్కడికి చేరాలి. మన మనసులు కలిసినా కలవకపోయినా, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ముందుకుసాగాలి’ అని ఓ హిందీ వాక్యంతో ఖర్గే ప్రసంగాన్ని ముగించారు.

కేంద్రంలో ప్రమాదకర బీజేపీని ఎలాగైనా ఓడించాలని ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. దేశాన్ని కాపాడుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ ఒక్క సీటు(వారణాసి)నైనా ఎలా గెలుచుకోవాలో బీజేపీకి అర్థం కావడం లేదని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఓ వైపు అవినీతి గురించి మాట్లాడుతూనే కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని కర్ణాటక సీఎం కుమారస్వామి ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాల్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మోసగించిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

‘మోడీ’ ఇంటికే!

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×