Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చంద్రబాబుకి తలనొప్పిగా మారిన కేశినేని నాని

పార్టీకి ఎన్నో ఏళ్ళుగా ఆర్థికంగా అండదండగా ఉన్నందుకు కృతజ్ఞతగా 2014లో కేశినేని నానిని విజయవాడ ఎంపీగా చేసుకున్న చంద్రబాబుకి ఇప్పుడు అదే  కేశినేని నాని వ్యవహారశైలి తలనొప్పిగా మారింది. ఎంపీ అయినప్పటినుండి విజయవాడ స్థానిక విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు  అటు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా అనవసర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబుకి ప్రశాంతతలేకుండా చేస్తున్నారు కేశినేని నాని. ఆయన వ్యాఖ్యలతో ఇతర పార్టీల నాయకులు, అధికారులేకాకుండా సొంత పార్టీ నాయకులకు సైతం చమటలు పట్టిస్తున్నారు.

Kesineni nani Straight forward attitude creating trouble to the ruling party

2014లో రాజకీయ తెరంగేట్రం చేసిన కేశినేని నాని తొలి ప్రయత్నంలోనే విజయవాడ ఎంపీగా విజయం సాధించి తన సత్తా చాటారు. విజయం సాధించడంతోనే సరిపెట్టుకోకుండా నగరాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ క్రమంలో తన సొంత పార్టీకి చెందిన మంత్రులతో ఢీకొట్టేందుకు కూడా ఆయన ఏమాత్రం వెనుకాడలేదు. నగర ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందని భావిస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని పట్టుబట్టి మరీ కేంద్రం చుట్టూ తిరిగి పని మొదలయ్యేలా వెంటబడ్డారు.

అయితే అప్పుడప్పుడు కేశినేని నాని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నేరేపుతున్నాయి. విజయవాడలో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంని దూషించిన తర్వాత ఏకంగా సీఎం చంద్రబాబే ఈ వ్యవహారంలో కల్పించుకొని నానితో క్షమాపణలు చెప్పించారు.  ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేశినేని ట్రావెల్స్ ప్యాసింజర్ బస్సులను మూసేసిన నాని తన పంతాన్ని నెగ్గించుకున్నారు.  ఆ తర్వాత మిత్రపక్షంగా ఉన్న బీజేపీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు నాని. బీజేపీతో కలిసి పోటీ చేయకుండా ఉండి ఉంటే మూడులక్షల ఓట్ల మెజారిటీ దక్కేదన్న నాని వ్యాఖ్యలు ఒక్క బీజేపీలోనేకాకుండా సొంతపార్టీ టీడీపీలోనూ కలకలం రేపాయి.

ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీకి సంబంధించినవా? అని నిలదీశారు. నాని మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాననే చెప్పారు.  దొరికిందే తడువుగా కమలనాథులు సైతం టీడీపీతో సంబంధాలు తెంచుకోవడానికి ఒక దారి దొరికిందంటూ సంబరపడి నానా రాద్ధాంతం చేశారు. అంతటితో ఆగకుండా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలని ఒత్తిడిసైతం తెచ్చారు.  అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వివాదాన్ని చాకచక్యంగా సర్దుబాటు చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య బంధం కొనసాగుతుందని మహానాడులోనూ చెప్పి కొంత శాంతపర్చారు. కేశినేని నానిని సైతం చంద్రబాబు తలంటారు.

ఆ తర్వాత లేటెస్ట్‌గా అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో రిజిష్ట్రేషన్లు చేయించుకొన్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు వెయ్యి బస్సులకు సంబంధించిన రిజిష్ట్రేషన్లను రద్దు చేసిన ఘటనలో కేశినేని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినా కమిషనర్ కు మెయిల్ పంపినా చర్యలు తీసుకోవడం లేదన్నది నాని ఆరోపణ. అంతేగాక రవాణాశాఖ అధికారులు అవినీతి పరులుగా కేశినేని మాట్లాడటంతో ప్రభుత్వం తరుపున రవాణాశాఖా మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై స్పందించారు.

కేశినేని నాని వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం పట్టించుకోదన్న అచ్చెన్నాయుడు, తమకు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి వాట్సప్ లో మెసేజ్ వచ్చిందని, వాట్సప్ మెసేజ్ ఆధారంగా చర్యలు ఎలా తీసుకుంటామని అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు. 900 బస్సులను ఉన్నపళంగా రద్దు చేస్తే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతారని మంత్రి అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కేశినేని వ్యాఖ్యలపై స్పందించిన రవాణాశాఖ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు వచ్చాకే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇలా ఒకదాని తర్వాత ఒక వ్యవహారంతో విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తూ చంద్రబాబుకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు.

The post చంద్రబాబుకి తలనొప్పిగా మారిన కేశినేని నాని appeared first on .This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

చంద్రబాబుకి తలనొప్పిగా మారిన కేశినేని నాని

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×