Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

‘బాహుబలి2 – ది కంక్లూజన్’ మూవీ రివ్యూ

సినిమా: బాహుబలి2 ది కంక్లూజన్

నటీనటులు : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్

సంగీతం : ఎమ్.ఎమ్ కీరవాణి

నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?? భాషకు సంబంధంలేకుండా రెండేళ్ళుగా దేశంలోని ప్రతి ఒక్కరి నోటిలో నానుతున్న ప్రశ్న. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాకు కొనసాగింపుగా అనేక ప్రశ్నలకు సమాధానాలు చూపిస్తూ, సందేహాలను తీరుస్తూ తెరకెక్కిన దృశ్యకావ్యం ‘బాహుబలి – ది కంక్లూజన్’. భారీ బడ్జెట్‌తో ప్రపంచసినిమాకు ధీటుగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 8వేలకు పైగా ధియేటర్లలో విడుదలైంది. అసలు బాహుబలి ది కంక్లూజన్‌లో రాజమౌళి ఎలాంటి అద్భుతాలను చూపించారు. అసలు కట్టప్ప బాహుబలిని చంపడానికి వెనుక  జరిగిన కథ ఏంటి?

కథ :

అమరేంద్ర బాహుబలి(ప్రభాస్) రాజమాత శివగామి(రమ్య కృష్ణ) ఆజ్ఞ మేరకు మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడవడానికి సన్నద్ధమవుతుంటాడు. దేశంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నారో తెలుసుకోవడానికి రాజు కాబోతున్న బాహుబలి పర్యటనకు బయలుదేరిన బాహుబలి మార్గమధ్యంలో దోపిడీదొంగల నుండి ప్రజలను కాపాడుతున్న కుంతలదేశం యువరాణి దేవసేనను మొదటి చూపులోనేే ప్రేమిస్తాడు. అయితే తను ఎవరో చెప్పకుండా మారు పేర్లతో కుంతల దేశానికి వెళ్ళి అక్కడ రాజప్రాసాదంలో ఉంటూ దేవసేనకు తనపై ఇష్టం పెరిగేలా చేస్తుంటాడు. అదే సమయంలో బాహుబలి అంటే ఏమాత్రం ఓర్వలేని భల్లాలదేవుడు ( రానా) దెబ్బతీయడానికి  రాజమాత శివగామే బాహుబలిని రాజుగా పట్టాభిషేకం చేయకుండా ఆపేలా కుట్రలు పన్ని సఫలీకృతుడౌతాడు.

మాహిష్మతి సింహాసనాన్ని ఒదులుకున్నప్పటికీ భల్లాలదేవుడు ప్రజల్లో బాహుబలికి ఉన్న పలుకుబడి, ఇష్టాన్ని చూసి ఓర్వలేక బాహుబలిని, దేవసేనను ఎలాంటి కష్టాలు పెడతాడు? బాహుబలి అంటే ఎంతో ప్రాణంగా చూసుకొనే శివగామి బాహుబలిని ఎందుకు సింహాసనాన్ని అధిష్టించకుండా ఆపింది? అసలు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కట్టప్పే బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నదే కథ

ఎనాలసిస్:

బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగోడి సినిమా కీర్తి ప్రతిష్టలు పెంచిన దర్శకుడు రాజమౌళి తన ఊహల్లో ప్రతి సన్నివేశాన్ని ఎంత గొప్పగా అయితే ఊహించుకున్నాడో అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించిన సినిమా బాహుబలి ది కంక్లూజన్. సినిమాలో  హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం నుండి ఒక చిన్న కథను గొప్ప కథగా మరల్చడంతోపాటు, ఎక్కడా స్క్రీన్ ప్లే‌లో ప్రేక్షకులకు ఆసక్తి ఏమాత్రం తగ్గించకుండా ప్రతీ సీన్‌ను ఒకదానికి మించి మరొకటి ఉండేలా తెరకెక్కించి కళ్ళు చెదిరే ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌తో సినిమాను తెరకెక్కించారు. ‘బాహూబలి’ సినిమా ఎంతగా విజువల్ వండర్‌లా భారీగా ఉందో దానికి రెండింతలు భారీతనంతో తెరకెక్కించారు.

ప్రతి 15 నిముషాలకొక అదిరిపోయే సీన్ చూపించి సినిమా రేంజ్‌ను పెంచేశాడు రాజమౌళి. ప్రభాస్, అనుష్క‌ల ఇంట్రో సీన్లు సినిమాకే హైలెట్ అనుకుంటే వాటిని తలదన్నేలా యుద్ధ సన్నివేశాలు అలా ప్రతీ సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సినిమా పూర్తయ్యే వరకు కంటిన్యూ చేసి ఆకట్టుకున్నాడు రాజమౌళి. అంతేగాక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సుల్లో రమ్యకృష్ణ, అనుష్క, ప్రభాస్ ల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా, కుంతల దేశంలో ప్రభాస్, అనుష్కల మధ్య జరిగే సన్నివేశాలు సినిమా రేంజ్‌ను పెంచేశాయి. రాజమౌళి భారీతనానికి తగ్గట్టుగా మాహిష్మతి సామ్రాజ్యాన్ని, కుంతల దేశాన్ని చాలా అద్భుతంగా రూపొందించారు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. ఇక వాటిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా కనబడేలా ఆర్.సి. కమల్ కణ్ణన్ ప్రపంచస్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను, సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారు.దీంతో సినిమాలో ప్రతీ సీన్‌లో భారీతనం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది.

కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకున్న ప్రధాన బలాల్లో ఒకటి. ప్రభాస్ కనిపించే సీన్లలో బ్యాక్ గ్రౌండ్లో రన్ అయ్యే ‘హైస్స ముద్రస్స’ అనే పాట వినబడినప్పుడల్లా ఒళ్ళు పులకరించేలా చేసింది. అంతేగాక పాటలకు ఆయన ఇచ్చిన సంగీతం చాలా వినసొంపుగా ఉంది. ‘హంస నావ, దండాలయ్యా’ పాటల సంగీతం చాలా బాగుంది.

బాహుబలిలాంటి సినిమాకు దర్శకుడు ఎంత ముఖ్యమో కథా బలాన్ని ప్రతీ పాత్రతో పెంచే రచయితా అంతే ముఖ్యం. రచయిత విజయేంద్ర ప్రసాద్ బాహుబలిలో ఒక్కో పాత్రను ఎంతో శ్రద్ధతో తయారుచేసి వాటికి ప్రాణంపోసారు. అందుకే సినిమా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత కూడా అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, దేవసేన, బిజ్జలదేవుడు, శివగామి వంటి క్యారెక్టర్స్ మనల్ని వదిలి వెళ్ళకుండా మన వెంటే ప్రయాణిస్తాయి.

అంతేగాక ప్రభాస్ అనుష్కల ఇద్దరి ట్రాక్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన రాజమౌళి ఎంతో అందంగా చూపించారు. సినిమాలో ఒకవైపు సీరియస్ సీన్లు నడుస్తుంటే మరోవైపు వీళ్ళిద్దరు కనిపించినప్పుడు ఎంతో ఉద్వేగభరితంగా ఉండేలా తెరకెక్కించారు. రాజమౌళి నటీనటుల నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో పూర్తి విజయం సాధించారు. నటీనటుల ఒక్కొక్కరు తమ పాత్రల మేర ఎవరికి వారే పోటాపోటీగా నటించారు.

ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ తన జీవితంలో మరిచిపోలేని ఓ గొప్ప క్యారెక్టర్ చేసి తనలోని నటుడికి ప్రాణం పోశాడు. యుద్ధంలో వీరత్వాన్ని, అనుష్క సాన్నిహిత్యంలో ప్రేమను, ధర్మం కోసం తల్లినే ఎదిరించే కొడుకుగా అంతర్మథనం పడే ఓ గొప్ప క్యారెక్టర్‌కు జీవం పోశాడు ప్రభాస్. కుంతలదేశపు యువరాణిగా అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కట్టిపడేసింది. ఒక అందమైన, ఆత్మగౌరవం, చిన్నపాటి అహంకారం కలిగిన యువరాణిగా ఆమె నటన చాలా బాగుంది.

భల్లాలదేవుని పాత్రలో రానా చాలా బాగా నటించాడు. ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా, బలవంతుడిగా అతని నటన, హావభావాలు చాలా రోజుల తర్వాత అసలైన విలనిజం అంటే ఏమిటో చూపించాయి. ప్రభాస్ తో ముఖాముఖి తలపడే సన్నివేశాల్లో, యుద్ధ సన్నివేశాల్లో రానా బల ప్రదర్శన, బాడీ లాంగ్వేజ్, ఉద్రేకపూరితమైన నటన చాలా బాగున్నాయి. రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ రెండవ భాగంలో కూడా ఆకట్టుకుంది. కనిపించే ప్రతి ఫ్రేములో రాజసం ఉట్టిపడేలా నటించారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాల్లో అయితే తిరుగులేదనే స్థాయిలో నటించారు. కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయి నటించాడు. సినిమా ఆద్యంతం హీరోతో పాటే కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తూ మెప్పించాడు. ఫస్టాఫ్‌లో ప్రభాస్ తో కలిసి మంచి కామెడీని అందించారు. ఇక బాహుబలిని చంపే సన్నివేశంలో, చంపాక శివగామిదేవితో మాట్లాడే సన్నివేశంలో ఆయన గొప్ప స్థాయి నటనను కనబర్చారు. అయితే ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మైనస్ పాయింట్లు ఏమీ లేకపోయినప్పటికీ తమన్నాకు కొన్ని డైలాగ్స్ ఇస్తే బాగుండేదనిపించింది.

ఓవరాల్:  ఇది మా సినిమా అని ప్రతీ తెలుగోడు గర్వం చెప్పుకోగలిగే బాహుబలి

రేటింగ్: 4.25 / 5

-శరత్ చంద్ర

The post ‘బాహుబలి2 – ది కంక్లూజన్’ మూవీ రివ్యూ appeared first on .This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

‘బాహుబలి2 – ది కంక్లూజన్’ మూవీ రివ్యూ

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×