Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు

చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజులు.

భండారు శ్రీనివాసరావు

హైదరాబాదులో ఎర్రమంజిల్ కాలనీ నుంచి జూబిలీ హాల్ కు బయలుదేరాను. అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ సంప్రదాయంగా ఇచ్చే అల్పాహార విందుకు వెళ్ళాలి. రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళి ఆటో పట్టుకోవాలి. ఇవతల ఎక్కుదామంటే ఒక్కడూ రాకపోగా సనత్ నగర్ అయితే తీసుకుపోతా అంటాడు. వాళ్ళతో పనికాదనుకుని సగం రోడ్డు దాటాను. ఇంతలో ముఖ్యమంత్రి వస్తున్న దాఖలాగా పోలీసుల హడావిడి కనిపించింది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడివాళ్ళను అక్కడే నిలిపేశారు. దాంతో నేను డివైడర్ మీదనే నిలబడిపోయాను.

ఈలోగా సీఎం కాన్వాయ్ రావడం పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు.

నేను ఆటో పట్టుకుని వెళ్ళేటప్పటికే అల్పాహార విందు మొదలయింది. విందు పూర్తి కావస్తుండగా సీఎం సెక్యూరిటీ అధికారి ఇక్బాల్ నాతో అన్నారు, ‘వస్తుంటే దారిలో డివైడర్ మీద నిలబడ్డ మిమ్మల్ని చూసాము, ఒక్కసారి సీఎం గారిని కలవండి, అని. చంద్రబాబు నన్ను చూస్తూనే ‘వచ్చారా సంతోషం, బ్రేక్ ఫాస్ట్ చేశారా, ఎవరక్కడ, వీరిని కనుక్కోండి’ అంటూ రోడ్డు మీద నన్ను గమనించిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. “సిటీలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, గట్టిగా ఏదైనా చేయాలి, చూద్దాం’ అన్నారు.

నేను మళ్ళీ ఇక్బాల్ దగ్గరికి వెళ్లి, ‘మరికొద్ది నిమిషాలు పోలీసులు అక్కడ వుంటే కొంపలు మునగవు కదా’ అన్నాను. ఆయన నవ్వుతూ, ‘అవును మీ సలహా బాగానే వుంది, కమీషనర్ గారితో చెప్పి చూస్తాను’ అన్నారు మర్యాదగా. సలహా బాగానే వుందన్నారు అందరూ. కానీ, ఇన్నేళ్ళు గడిచినా అది పట్టించుకున్నట్టు దాఖలా నాకయితే కనిపించడం లేదు.

ట్రాఫిక్ కు సంబంధించి వై ఎస్ తో మరో జ్ఞాపకం వుంది.

హైదరాబాదు ప్రెస్ ఫొటోగ్రాఫర్ల సంఘం వాళ్ళు ఏటా ఒకసారి సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఫోటో ఎగ్జిబిషన్ పెడుతూ వుండడం రివాజు. అది జరిగినన్నాళ్ళు ప్రతిరోజూ ఒక అతిధిని ఆహ్వానిస్తుంటారు. అలాగే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలిచారు. రిసీవ్ చేసుకోవడానికి మేమంతా క్లబ్ మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నాము. వైఎస్ కారులో కేవీపీ కూడా వున్నారు. రోడ్డుకు అటువైపు వున్న ఈనాడు మీదుగా వెళ్లి యూ టర్న్ తీసుకుని రావాలి. టర్న్ తీసుకునేలోగానే, సీఎం వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేసారు. ఎదురుగా వున్న రోడ్డులో వాహనాల నడుమ నిలిచివున్న వైఎస్ కారుని ఇటువైపునుంచి మేము చూస్తూనే ఉన్నాము. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రావడం, సచివాలయం వైపు దూసుకు పోవడం జరిగింది. ట్రాఫిక్ కదిలింది. మలుపు తీసుకు వచ్చిన వైఎస్ కారు క్లబ్ దగ్గర ఆగకుండా గేటు దగ్గర నిలబడి వున్న మా కళ్ళ ముందే, ముందుకు వెళ్ళిపోయింది. వెంటనే నేను కేవీపీ మొబైల్ కి ఫోను చేశాను. ఆయన ‘అరెరే! బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ అనుకున్నాము’ అని నొచ్చుకుంటూ చెప్పారు. ఆ వెంటనే విశ్వేశ్వరయ్య చౌరాస్తాలో మళ్ళీ వెనక్కి తిరిగి క్లబ్ కి చేరుకున్నారు.

  •  

The post చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు appeared first on .



This post first appeared on - Sakalam Telugu News, please read the originial post: here

Share the post

చంద్రబాబు, వై ఎస్ – రెండు జ్ఞాపకాలు

×

Subscribe to - Sakalam Telugu News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×