Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)


                                            నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)



మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న శ్రోత్రం న జిహ్వాన చ ఘ్రాణనేత్రం
నచార్వ్యోమ భోమిర్నతెజోనవాయుః
చిదానందరూపః శివోహం శివోహం

మనసు, బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను.ప్ఱుథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. సచ్చితానందానికి సులభమైన నిర్వచనము ' సత్ అంటే సత్యము – చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.

నచ ప్రాణ సంగో నవి పంచ వాయుః
నవా సప్తధాతుర్నవా పంచ కోశః
నవాక్పాణిపాదౌ నచోపస్థ పాయుః
చిదానందరూపః శివోహం శివోహం

పంచవాయువులు:ప్రాణ : శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు
అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు
వ్యాన: శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం
ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు
సమాన: జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు
ఉప ప్రాణాలు
నాగ : త్రేన్పు గా వచ్చే గాలి
కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి
కృకల : తుమ్ము
ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.
దేవదత్తం : ఆవులింత లోని గాలి

ఈ ఐదు వాయువులు,ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము.ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది.

సప్త ధాతువులు: రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు (చర్మము, రక్తము, మాంసము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో చర్మము రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు, దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. పూర్వము 'నీ తస్సదీయ' అనేమాట సాధారణంగానూ సినిమాలలోనూ (రేలంగి వాడినట్లు గుర్తు) వాడేవారు. 'తస్స' అంటే ఈ 'మజ్జ'యే.

పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు-కాళ్ళు,ఉపస్థ-జననేంద్రియము,పాయువు-గుదము, ఉపస్థాపాయువులు అంటే పురీష శౌచ ద్వారములు.

నేను, పైన తెలిపినవేవీ కాను.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

నమేద్వేష రాగౌ నమేలోభ మోహౌ
మదోనైవ మేనైవ మాత్సర్యభావః
నధర్మోనచార్థోనాకామోనమోక్షాః
చిదానంద రూపం శివోహం శివోహం

నాకు రాగ ద్వేషములు లేవు.లోభామోహములు లేవు. మదమాత్సర్యములు లేవు.ధర్మార్థకామ మోక్షాలు లేవు. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

నపుణ్యం నపాపం ణ సౌఖ్యం ణ దుఖ్ఖం
న మంత్రో నతీర్థం నవేదా నయజ్ఞ్యాః
అహం భోజనం నైవ భోజ్యం నభోక్తా
చిదానందరూప శ్శివోహం శ్శివోహం

నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఖ్ఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ ,భోజనమునుగానీ,బుజించేవాడినిగానీ కాదు. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

నమృత్యుర్నశంకానేమ్ జాతిభేదః
పితానైవమేనైవ మాతానజన్మాః
నబంధుర్నమిత్రంగురుర్నైవశిష్యః
చిదానంద రూపం శివోహం శివోహం

మృత్యువు,భయము లేక సందిగ్ధత,జాతిరీతులు,తల్లిదండ్రులు,అసలు జన్మమే, బంధువులు మిత్రులు,గురువు,శిష్యులు ఏమీ లేవు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

మరి నేనెవరు ?

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
నవాబంధానం నైవ ముక్తిర్నబంధః
చిదానంద రూపం శివోహం శివోహం

వికల్పము : మతి భ్రమ, ఉల్లంఘనం జ్ఞాపకశక్తి, ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి
అస్తవ్యస్తం, తారుమారు.

నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు.నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని).నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు.నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

ఆత్మ ను గూర్చి ఇంత వివవరంగా విశదంగా విపులంగా విలేవారీగా అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన ఆది శంకరులకు అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తుడను.


This post first appeared on Thought Is Life, please read the originial post: here

Share the post

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)

×

Subscribe to Thought Is Life

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×