Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఒట్టు (కథ)


రచయిత : బివిడి ప్రసాదరావు

        ఆయన అస్థిమితంలో ఉన్నాడు.
అంతా అస్తవ్యస్తంగా ఆయననే గమనిస్తున్నారు.
"సుధాకర్ ఇంకా రాలేదా" అడిగాడు ఆయన ఒక్కమారుగా.
"దార్లో ఉన్నారు" చెప్పాడు ఒకడు.
కాలం భారంగా దొర్లుతుందనిపిస్తుంది వాళ్లకి.
సుధాకర్ రానే వచ్చాడు. వస్తూనే - "చెప్పండి డాడీ" అన్నాడు ఆయననే చూస్తూ.
ఆయన - "అన్ని రకాలుగా యత్నించావ్. భయపెట్టావ్. బెదిరించావ్. ఐనా వాళ్ల యాగీ మానడం లేదు. ఏదో చెయ్యాలి. లేదంటే పరువు పరపతి దిగజారిపోతాయి" అన్నాడు. 
ఆయన ఆవేశం బుసలు స్పష్టంగా తెలుస్తున్నాయి.
సుధాకర్ - "ఆ వీరయ్యని లేపేస్తే పీడ పోతోంది." అన్నాడు చురుగ్గా.
"అరెయ్ అదే వద్దంటుంది. వాడికి ఏం జరిగినా మనమే కారణమంటారు. అది కాదు ఏదో చేయాలి. ఏం చెయ్యాలి. అదీ వెంటనే జరిగి తీరాలి." అన్నాడు ఆయన గమ్మున.
అక్కడ అంతా మొహాలు చూసుకుంటున్నారు.
ఆయన ఝమ్మున లేచి అటు ఇటు జోరు జోరుగా కదులుతున్నాడు.
సుధాకర్ అర చేతుల్ని రుద్దుకుంటున్నాడు.
ఆయన సుముఖిరావు. పెద్ద వ్యాపారవేత్త. 
ఆయన ఒక సంస్థలో పనివారు పద్ధతి ప్రకారమే సమ్మె చేపట్టారు. అది పది రోజులు దాటింది. ఆ సమ్మెకి వీరయ్య నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వం పకడ్బంధీగా ఉంది. అంచేతనే యాజమాన్యం ఎన్నెన్ని విధాలుగా ప్రలోభాలు భయభ్రాంతులు గుప్పిస్తున్నా ఆ సమ్మె బిగి రవ్వంతైనా సడలింపు కావడంలేదు.
ఇక ఉపేక్షణ వల్లకాదని ఏదోలా పరిష్కారంకై ముందు పడాలని సుముఖిరావు ప్రాకులాడుతున్నాడు.
సుధాకర్ తిక్క వాడు. దాంతో యోచనా స్థితికి చేరువ కాలేకపోతున్నాడు. దాంతోనే సమ్మె జటిలమైందని భావించిన సుముఖిరావు రంగంలోకి తప్పక ప్రవేశించాడు.
"వీరయ్యతో నాకు సమావేశం ఏర్పర్చు" అని చెప్పాడు సుముఖిరావు.
"వాడు వినడు. నేను మాట్లాడేనుగా. అబ్బే వాడు -" అని చెప్పుతున్న సుధాకర్ కి అడ్డు పడి -
"నేను మాట్లాడాలి. వీరయ్యకి కబురు పంపు." అన్నాడు సుముఖిరావు విసురుగా.
సుధాకర్ జడిశాడు. "అలాగే" అనేశాడు.
 ***
సుముఖిరావు యోచన మరోలా ఉంది. సంధి కుదుర్చుకోవాలని ఆయనకి ఏ కోశాన లేదు. వీరయ్య మీద చెప్పలేనంత కోపం ఆయనలో ఉంది. 
వీరయ్య నాయకత్వాన్ని ఛీ కొట్టించాలన్న తలంపులో ఉన్నాడు సుముఖిరావు. తద్వారా మిగతా పనివారిచే అతడిని ఈడ్చి ఈడ్చి కొట్టించి అతడిని తరిమి కొట్టించేలా పథకం పన్నాడు సుముఖిరావు.
అందుకై ఇవ్వని దానికి ఎంతైతే ఏమిటన్నట్టు సమ్మె విరమింపచేయడానికి వీరయ్యకు ఎంతైనా ముట్ట చెప్పుతాననడానికి సిద్ధమయ్యాడు సుముఖిరావు.
వీరయ్యతో అందుకే సమావేశమేర్పర్చమని తహతహ లాడుతున్నాడు సుముఖిరావు.
తామిద్దరూ సమావేశం కాగా తన ఆలోచనని అమలు పర్చాలని తలించిన సుముఖిరావు పకడ్బందీగా తాము కలవబోయే చోట శక్తివంతమైన రహస్య కెమెరాలని ఒక నమ్మకస్తుడుతో పెట్టించాడు. పైగా అలా ఆ కెమెరాలని అమర్చిన ఆ నమ్మకస్తుడును కూడా తన బంధీగా ఒక చోట దాచేశాడు గట్టి బెదిరింపుతో.
***
నిజానికి వీరయ్యకి నిజాయితీ ఎక్కువ. పరోపకారం ఎక్కువ. నిలకడ ఎక్కువ. ఈ లక్షణాల మూలంగా వీరయ్య అందరికీ మక్కువ.
"సార్ కబురు పెట్టారు" చెప్పాడు వీరయ్య భార్య వెంకటితో.
"ఏ సార్" అడిగింది వెంకటి.
"పెద్ద సార్" చెప్పాడు వీరయ్య.
"అవునా. ఐతే సమ్మె ముగిసినట్టే. చిన్న సార్లా కాదు ఆయన. వెళ్లండి." అంది వెంకటి.
వీరయ్య, "ఆయన ప్రలోభపరిచే మనిషే" చెప్పాడు.
"భలే. ఐతే పెద్ద సార్ చెప్పింది వినుకోండి. ఆయన మెప్పు పొందితే బాగుపడతాం. అవకాశం వచ్చింది. వదులుకోవద్దు." అంది వెంకటి ఒక్కమారుగా.
"అంటే ఏమంటావు." అడిగాడు వీరయ్య.
"మనం బాగు పడదాం అంటున్నాను. మీ కోరికలా జీతాలు పెంచితే ఒరిగేది ఏమిటి. కొన్నాళ్లకు అదీ మూరడే ఐ మళ్లీ పెంచమని మళ్లీ సమ్మె అంటారు. ఆ సమ్మె వరకు మీరు లీడర్ గా ఉంటారా ఏం. వచ్చిందే ఛాన్స్. వాడుకుందామంటున్నాను." అంది వెంకటి సులభంగా.
"అంటే ఏమిటే" అన్నాడు వీరయ్య గమ్మున.
"ఆయన ఎంతో చెప్పుతారు. పుచ్చేసుకోండి. మనం బాగుంటాం." చెప్పింది వెంకటి పుసుక్కున.
"హేయ్. ఏమంటున్నావే. తప్పు. తప్పు." అన్నాడు వీరయ్య విసుగ్గా.
"చాల్లెండి. మరీ మంచి పనికిరాదు. ఎవరేమనుకుంటే మనకేంటి. ముట్ట చెప్పేది అందరూ చూపి ఇస్తారా ఏమిటి"  చెప్పుతుంది వెంకటి.
వీరయ్య ప్రేక్షకుడులా ఉండిపోయాడు.
వెంకటి చివరికి అంది - "నా మాట మీరు వినాలి." 
వీరయ్యకి భార్య అంటే ఇష్టం. పైగా ఆమె ఒక రోగిష్టి అని జాలీ.
అందుకే వీరయ్య కళ్లల్లోకి చూస్తూ   - "మీరు పట్టుకొచ్చే దాంతో నా జబ్బు నయం అవుతుందేమో" అని అనేసింది వెంకటి.
వీరయ్య ఊగిసలాడుతున్నాడు.
వెంకటి మరింత ఊపేస్తుంది.
"కాదనవద్దు. నా మీద ఒట్టు." అనేసింది వెంకటి చివరాఖరులా. పైగా వీరయ్య కుడి అరచేతిని లాక్కొని తన తల మీద ఆన్చేసుకుంది.
***
సుముఖిరావు, వీరయ్యల సమావేశం నడుస్తుంది. 
ఆ ఇద్దరే ఉన్నారు.
"మాకు జీతాలు పెంచితే మీకు ఏడాదికి కోటీ ఇరవై లక్షలు పెరుగుతాయి. ఆ మొత్తం మీరు భరించగలిగిందే. పైగా మీరు మా జీతాలు పెంచితే మేము రోజుకు మా పని కాలాన్ని ఒక గంట పెంచుతామన్నాంగా. అది మీకు ఎంతో లాభం కదా" అని చెప్పుతున్నాడు వీరయ్య.
"వీరయ్యా ఆ లెక్కలు నాకు తెలియక కాదు. ఇలా సమ్మెతో మీరు మమ్మల్ని నిలదీయడం నాకు నచ్చడం లేదు. తల ఒగ్గినట్టు ఉంటుంది. పైగా ప్రతి దానికీ మీరీ సమ్మెను వాడేసుకుంటున్నారు. అందుకే సమ్మె అంటే మేము ఖాతరు చెయ్యమని మీకు తెలియాలి. అందుకే నేను నీ ఒక్కడితో మాట్లాడుతున్నాను. నువ్వన్నట్టే ఏడాదికి మాకు కోటి ఇరవై లక్షలు అదనం. అందుకే మరో ఎనభై లక్షలు అదనం చేసి నీకు రెండు కోట్లు ఇస్తాను. ఈ సమ్మె ఆపించేయ్. ఇది మన ఇద్దరి మధ్యే ఉండిపోతుంది. ఒప్పుకో." చెప్పేశాడు సుముఖిరావు.
వీరయ్య ఏమీ అనలేదు. భార్య వెంకటి ఒట్టు అతడి గుర్తులో ఉంది. 
"కాదనకు. వీరయ్యా హాయిని కోరుకో. కలిసి వచ్చింది. కాదనుకోకు. మిగిలిన నీ పని కాలంలో జీతాలు ఎంత పెరిగినా నువ్వింత మొత్తం సంపాదించ లేవు. ఒప్పేసుకో. మళ్లీ చెప్పుతున్నాను. ఇది మన మధ్య తప్పా మరొకరికి ఎన్నటికీ తెలియదు." చెప్పాడు సుముఖిరావు.
వీరయ్య చుట్టూ చూస్తున్నాడు.
అప్పుడే తన వైపు టేబుల్ క్రింద అంచున అమర్చి పెట్టుకున్న రహస్య కెమెరాల బటన్ని నొక్కేశాడు సుముఖిరావు.
ఆ కెమెరాలు పని చేస్తున్నాయి.
సుముఖిరావు కాస్తా వంగి టేబుల్ కింద దాచి పెట్టుకున్న క్యాష్ బ్యాగును అందుకున్నాడు. దానిని టేబులు మీద పెట్టాడు. దానిని తెరిచాడు. దాని నిండా నోట్ల కట్టలు. 
వీరయ్య వాటిని చూశాడు.
సుముఖిరావు ఆ బ్యాగును వీరయ్య వైపుకు తోశాడు.
వీరయ్య ఆ బ్యాగును దరికి లాక్కొని దాని మూత మూశాడు. జిప్ లాగాడు. లేచాడు. 
సుముఖిరావు సరదా పడ్డాడు. నవ్వుకున్నాడు.
వీరయ్య చేయి చాచాడు. సుముఖిరావుకు షేక్ హేండ్ ఇచ్చి, ఆ బ్యాగుతో బయటకు కదలబోయాడు.
"అదేమిటి ఈ డబ్బుతో బయటకు వెళ్తావా. మీ వాళ్లు బయట ఉన్నారుగా." అన్నాడు సుముఖిరావు.
వీరయ్య నవ్వేడు. ఆ వెంటనే బయట వైపుకు నడిచాడు జోరుగా.
***
వీరయ్య నాయకత్వంలోని సమ్మె వాయిదా పడింది. తనను అనుసరించిన వారంతా అతడు చెప్పింది విన్నారు. ఆమోదించారు.
***
తన రహస్య కెమెరాల ఫుటేజీని తన చేతులతోనే తగలెట్టేస్తున్నాడు సుముఖిరావు తన చెవుల్లో గంట క్రితం జరిగిన సభలోని మాటలు గింగురులు పెడుతుండగా - 
ఆ మాటలు వీరయ్యవి. అవి - "సంస్థ ఆర్థిక స్థితి బాగోకపోయినా మనని నిరుత్సాహ పర్చకూడదని రెండు కోట్లు సర్ది యూనియన్ సభ్యులందరికీ సద్వినియోగించమన్నారు పెద్ద సార్. ఆర్ధిక స్థితి కుదుట పడిన వెంటనే మన జీతాల పెంపు చేపడతానని మాట ఇచ్చారు. అందుకు వారికి అందరి తరుపునా ధన్యవాదాలు తెల్పుతున్నాను." అన్నవి.
***
"సంతృప్తా" అడిగాడు వీరయ్య వెంకటిని.
వెంకటి వెంటనే ఏమీ అనలేదు.
అంతలోనే వీరయ్య - "నీ ఒట్టు ప్రకారం నేను డబ్బులు పుచ్చుకున్నాను. ఆ మొత్తం బ్యాంకులో మా యూనియన్ పేరున పర్మనెంట్ డిపాజిట్ చేశాను. దాని వడ్డీ మాత్రం మా యూనియన్ కుటుంబాల వైద్య ఖర్చులకు మాత్రమే వినియోగపడేలా చేశాను. ఆ డబ్బులతో నీ జబ్బు కూడా నయం కాకపోదు." అని అన్నాడు.
వెంకటికి వీరయ్య ఆనడం లేదు. కారణం ఆమె కళ్లు ఒలకబోస్తున్న ఏకధాటి కన్నీరే.
***


This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

ఒట్టు (కథ)

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×