Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

టీఆర్ఎస్ కు కొండా సురేఖ రివర్స్ షాక్

Konda Surekha

సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా కొండా సురేఖకు టిక్కెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ షాకిచ్చారు. దీనికి కొండా సురేఖ రివర్స్ షాక్ తో మీడియా ముందుకొచ్చారు. మంత్రి కెటీఆర్ కోటరీని ఏర్పాటు చేసుకుంటున్నారని..ప్రశ్నించేతత్వం ఉన్న తనలాంటి వారిని పక్కకు పెట్టారని ఆరోపించారు. బిసి మహిళ అయినందుకే అందరి టిక్కెట్లు ప్రకటించి..తన టిక్కెట్ ప్రకటించలేదా? అని ప్రశ్నించారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవటానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బహిరంగ లేఖ రాస్తానని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి స్పందన వచ్చాకే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అవసరం అయితే తాము మూడు సీట్లలో ఇండిపెండెంట్ గా అయినా పోటీచేస్తామని తేల్చిచెప్పారు. అంతే కాదు..కెసీఆర్ ఫ్యామిలీపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అంటే కల్వకుంట్ల ఇల్లు కాదని ధ్వజమెత్తారు. పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో కొండా మురళితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తనపేరు లేకపోవడం బాధనిపించిందన్నారు. గత ఎన్నికల్లో పరకాల పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలనుకున్నామని, కానీ పదే పదే వర్తమానాలు పంపి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పరకాల నుంచి కాకుండా కేసీఆర్‌ తమపై ఒత్తిడి చేసి వరంగల్‌ ఈస్ట్‌ నుంచి పోటీ చేయించారని, అప్పటి అభ్యర్థి బస్వరాజు సారయ్య ఓడిపోవాలంటే తమే పోటీచేయాలని కన్విన్స్‌ చేశారన్నారు. పార్టీలో చేరేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని ఇచ్చారన్నారు. వరంగల్‌ ఈస్ట్‌ కొత్త అయినా ప్రజలు మా మీద నమ్మకంతో 55 వేల మేజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. పార్టీ నుంచి ఇప్పటి వరకు పైసా తీసుకోలేదని, సొంత డబ్బులతో కార్పోరేషన్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించామన్నారు. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదన్నారు. మహిళా మంత్రి లేని ప్రభుత్వం ఒక్క తెలంగాణనే అని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇవ్వక పోయినా కూడా ఎప్పుడు అడగలేదన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బీఫామ్‌లు తప్ప ఎలాంటి లాభం పొందలేదన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుంటే.. నాలుగు సార్లు గెలిచిన తనకు టికెట్‌ను ఆపడం ఏంటని ప్రశ్నించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొడిగే శోభ, బాబు మోహన్‌, నల్లాల ఓదేలులకు టికెట్లు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సారయ్య, గుండు సుధారాణి, దయాకర్‌ రావులను తమకు చెప్పకుండానే పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. తనకు టికెట్‌ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. టికెట్లు కేటాయించిన అభ్యర్థుల సర్వే రిపోర్టులను బహిర్గతం చేయాలన్నారు. ఈ 105 మందికి బీఫామ్‌ ఇస్తామని పత్రికా ప్రకటన ఇవ్వాలన్నారు. తాము రెండు స్థానాల్లో టికెట్లు ఆశించామని తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

భూపాలపల్లిలో తమ క్యాడర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దాంతోనే అవకాశం ఉంటే తమ కుటుంబ సభ్యులు పోటీచేస్తారని కోరాం తప్ప డిమాండ్‌ చేయలేదని స్పష్టం చేశారు. ప్రతి విషయంపై మంత్రి కేటీఆర్‌, సంతోష్‌లకు సమాచారమిచ్చామన్నారు. తనకు టికెట్‌ రాకపోవడానికి కేటీఆరే కారణమని ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలు సృష్టించింది ఆయన్నే అని ఆరోపించారు. కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు. తమ ఫోన్స్‌ ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఇండిపెండెంట్‌గా ఎక్కడ నిలబడ్డా గెలిచే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సమాధానం బట్టి రెండు రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here

Share the post

టీఆర్ఎస్ కు కొండా సురేఖ రివర్స్ షాక్

×

Subscribe to Telugu News - Telugu Newspaper - Telangana Breaking News

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×