
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో అభ్యర్దుల మార్పు ఖాయమా?. అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ఇప్పటికే సీనియర్లలో చాలా మందిని ‘ఢిల్లీ బాట’ పట్టించాలనే యోచనలో కెసీఆర్ ఉన్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో భాగంగానే తుమ్మల ఈ సారి లోక్ సభకు పోటీ చేయటం ఖాయం అని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేని శ్రీనివాసరెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆయన కేబినెట్ లోకి వచ్చేలా ఈ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం కెసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు చాలా కాలం టీడీపీలో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోపాటు…ఖమ్మం జిల్లాలో సరైన నేత లేకపోవటంతో కెసీఆరే స్వయంగా తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించి మరీ మంత్రి పదవి కట్టబెట్టారు.
గత ఎన్నికల్లో తుమ్మల పరాజయం పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి మరణంతో జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. వాస్తవానికి పొంగులేని శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలిచింది కూడా వైసీపీ అభ్యర్ధిగానే. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి…టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో చాలా మంది కెసీఆర్ సమకాలీనులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే..కెటీఆర్ కు అనుకూలంగా ఉండే వ్యక్తులకే అసెంబ్లీ సీట్లు ఇఛ్చి…గెలిపించాలన్నది కెసీఆర్ ప్లాన్ గా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే రాజకీయాల్లో చాలా సీనియర్లు అయిన వారు ఉంటే కెటీఆర్ కు అనవసర ఇబ్బంది అనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
This post first appeared on Telugu News - Telugu Newspaper - Telangana Breaking News, please read the originial post: here